ఇంగ్లాండ్ పర్యటన కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఎట్టకేలకు స్పాన్సర్‌ను పొందగలిగింది. అయితే, ఊహించిన దానికంటే చాలా తక్కువ మొత్తానికి ఈ ఒప్పందం కుదిరింది. కొన్నేళ్లుగా వివిధ స్పాన్సర్షిప్, మీడియా హక్కులు కొనుగోలు చేస్తున్న ట్రాన్స్‌మీడియా అనే సంస్థతో పీసీబీ ఏడాది పాటు ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటికే ట్రాన్స్‌మీడియా అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తూ.. పీసీబీకి ఏటా రూ.150 మిలియన్ల వరకు చెల్లిస్తోంది. పాకిస్థాన్ జట్టు జెర్సీలు, వస్తువులపై తమ లోగో కోసం మూడేళ్ల ఒప్పందంలో భాగంగా.. ట్రాన్స్‌మీడియా రూ.600 మిలియన్లు ఆఫర్ చేసింది. అనేక సంస్థలతో ఒప్పందం విషయంలో నిరాశను ఎదుర్కొన్న బోర్డు.. ప్రస్తుతం ఏడాది పాటు రూ. 200 మిలియన్ల ఒప్పందంపై సంతకం చేయాలని నిర్ణయించుకున్నట్లు అధికారులు తెలిపారు.