టీమ్‌ఇండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ అద్భుతమైన ఆటగాడని యువపేసర్ నవదీప్ సైని ప్రశంసించాడు. గాయపడ్డ తాను క్రీజులోకి వచ్చినప్పుడు అన్నీ అతడే చూసుకుంటానని పంత్ తనతో చెప్పాడని అన్నాడు. ఏ మాత్రం రిస్క్ తీసుకోవద్దని సూచించాడని వెల్లడించాడు.
గబ్బా వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. ఆ టెస్టులో నవదీప్ సైని గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. పూర్తి స్థాయిలో బౌలింగ్, ఫీల్డింగ్ చేయలేదు. అయితే 328 పరుగుల లక్ష్య ఛేదనలో ఆఖరి 3 నిమిషాలు నవదీప్ సైని బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. అయితే పంత్ విన్నింగ్ షాట్ బాదేసి విజయం అందించాడు. అతడికి శ్రమ లేకుండా చేశాడు.
"రిషభ్‌తో బ్యాటింగ్ చేయడం అదే తొలిసారి. చాలా సరదాగా అనిపించింది. భారత్‌ను అతడు గెలిపిస్తాడని తెలుసు. క్రీజులోకి వెళ్లిన వెంటనే నేనేం చేయాలని పంత్‌ను అడిగా. రిస్కీ పరుగు అవసరం లేదని తాను పిలిచినప్పుడు పరుగెత్తమని బదులిచ్చాడు. బ్యాటింగ్ క్రీజులోకి వెళ్లి మళ్లీ తిరిగొచ్చి ఆందోళన వద్దని మొత్తం తాను చూసుకుంటానని చెప్పాడు. పంత్ విన్నింగ్ షాట్ కొట్టినప్పుడు పరుగెత్తు అని పిలిచాడు. వీలైనంత వేగంగా పరుగెత్తాలని నాకు తెలుసు. బంతి ఎటువైపు వెళ్లిందో చూడకుండానే పరుగెత్తా. సంబరాలు చేసుకొనేందుకు అతడు నన్ను ఆపినప్పుడు మేం గెలిచామని అర్థమైంది. పంత్ బౌలర్లను చితకబాదుతాడని తెలుసు. నిజానికి అతడు చాలా కష్టపడతాడు. మానసికంగా బలమైన ఆటగాడు. విపత్కర పరిస్థితుల్లో ఆడేందుకు ఇష్టపడతాడు. ఎలాంటి గడ్డు పరిస్థితుల్లోనైనా అతడు మానసికంగా బలంగా నిలబడతాడు. అదే అతడిలోని అత్యుత్తమ గుణం' అని సైని అన్నాడు.
ఇదీ చూడండి : ఆ సమయంలో గుండె పగిలినట్లనిపించింది: పంత్