కరాచీ వేదికగా పాకిస్థాన్, శ్రీలంక మధ్య నేడు ద్వైపాక్షిక వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఈ వేదికపై తొలి మ్యాచ్కు ఆతిథ్యమిస్తోంది పాక్. ఈ పర్యటనలో భాగంగా ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనున్నాయి. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9 వరకు ఈ సిరీస్ జరగనుంది.
ఉగ్ర దాడితో బెంబేలు...
2009 మార్చి 3న లాహోర్‌లో లంక జట్టుపై ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో శ్రీలంకకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. అప్పట్నుంచి పాక్‌లో పర్యటించేందుకు పలు దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఆ దాడి తర్వాత తొలిసారి 2015లో పాక్‌లో పర్యటించింది జింబాబ్వే. చివరగా 2018లో టీ20 సిరీస్ కోసం పాక్‌లో పర్యటించింది వెస్టిండీస్.
అప్పట్లో ఓ పొట్టి మ్యాచ్...
2009 దాడి తర్వాత శ్రీలంక జట్టు ఓ సారి పాకిస్థాన్ వెళ్లింది. 2017 అక్టోబర్‌లో లాహోర్ వేదికగా ఒక టీ20 మ్యాచ్ ఆడింది లంక. అయితే అప్పటి కెప్టెన్‌గా థిసార పెరీరా కూడా ఈసారి పాకిస్థాన్ వెళ్లేందుకు నిరాకరించాడు.
భద్రతా కారణాలు దృష్ట్యా ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు పలువురు సీనియర్ క్రికెటర్లు నిరాకరించడం వల్ల... ద్వితీయ శ్రేణి యువ ఆటగాళ్లను మ్యాచ్లకు పంపింది శ్రీలంక క్రికెట్ బోర్డు. వన్డే జట్టుకు లాహిరు తిరుమన్నే సారథ్యం వహిస్తుండగా... టీ20లకు దాసున్ షణకను కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.