కరోనా పరిస్థితుల కారణంగా ఈ ఏడాది మార్చిలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైంది. అప్పుడు లీగ్ దశ పూర్తికాగా కేవలం ప్లేఆఫ్స్ మాత్రమే మిగిలాయి. ఇప్పుడు ఐపీఎల్ కూడా పూర్తవడం వల్ల దాయాది దేశం మిగిలిన లీగ్ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం తొలి క్వాలిఫయర్‌లో ముల్తాన్ సుల్తాన్స్ x కరాచి కింగ్స్ తలపడ్డాయి. మరో మ్యాచ్‌లో లాహోర్ కలందార్స్ x పెషావర్ జాల్మీ పోటీపడ్డాయి. అయితే, మ్యాచ్‌కు ముందు ముల్తాన్, కరాచీ ఆటగాళ్లు ఆస్ట్రేలియా దివంగత క్రికెటర్ డీన్‌జోన్స్‌కు నివాళులర్పించారు.
ఐపీఎల్ సమయంలో ఓ క్రీడాఛానల్‌తో కలిసి పనిచేసేందుకు జోన్స్.. భారత్‌కు వచ్చారు. సెప్టెంబర్ 19న యూఏఈలో మెగా టీ20 లీగ్ ప్రారంభమవ్వగా అదే నెల 24న ముంబయిలోని ఓ స్టార్‌హోటల్‌లో ఆయన గుండెపోటుతో మృతిచెందారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ సూపర్ లీగ్ పునఃప్రారంభమైన వేళ ఆ రెండు జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అతడికి నివాళులర్పించారు. D అనే ఆకారంలో నిలబడి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వీడియోను పీఎస్‌ఎల్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా.. క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున లైక్ చేశారు.