భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్పై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఎలాంటి అభ్యతరం లేదని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ క్రికెటర్ రమీజ్ రాజా. ఈ విషయంలో ఇమ్రాన్.. రాజకీయ పరిస్థితులతో పాటు ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నాడు. దాయాదికి ఆతిథ్యం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రమీజ్ రాజా చెప్పాడు.
"ఆట పరంగా అతడికి(ఇమ్రాన్ ఖాన్) ద్వైపాక్షిక సిరీస్ విషయమై ఎలాంటి సమస్య ఉండదని వందశాతం చెప్పగలను. రాజకీయంగా మాత్రం ఇరు దేశాల మధ్య పరిస్థితులు వేరుగా ఉన్నాయి. టీమ్ఇండియాను ఆహ్వానిస్తే పాక్ ప్రజలు ఎలా స్పందిస్తారనేది మరో విషయం. భారత్ చివరగా 2004లో పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. అలాంటిది మళ్లీ జరగాలని కోరుకుంటున్నా. దాయాది దేశంతో ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించేందుకు పాక్ 70-80 శాతం వరకు సిద్ధంగా ఉందని భావిస్తున్నాను" -రమీజ్ రాజా, పాకిస్థాన్ మాజీ క్రికెటర్