పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐదో ఎడిషన్ ట్రోఫీని నేడు ఘనంగా ఆవిష్కరించారు నిర్వాహకులు. అయితే ఈ లీగ్ మరోసారి వివాదస్పదమైంది. అందుకు కారణం ఈ మెగాటోర్నీ ప్రచార కార్యక్రమం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ప్రోమోను పోలినట్లు ఉండటమే. ఐపీఎల్ ప్రచార వీడియోను కాపీ కొట్టి పీఎస్ఎల్ ప్రోమో తయారు చేసింది టైటిల్ స్పాన్సర్ హబీబ్ బ్యాంక్. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేయగా.. తక్షణమే చర్యలు తీసుకున్నారు పాక్ లీగ్ క్రికెట్ నిర్వాహకులు. అంతేకాకుండా ప్రతిష్టాత్మకంగా భావించిన టోర్నీలో ఇలాంటి ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఐపీఎల్ కోసం ఎయిర్టెల్ సంస్థ రూపొందించిన ఓ ప్రకటనలాగే తమ వీడియో ఉన్నట్లు పీఎస్ఎల్ నిర్వాహకులు కూడా ధ్రువీకరించారు. ప్రస్తుత ప్రోమోను తొలగించి.. కొత్తది రూపొందించే పనిలో పడింది హబీబ్ బ్యాంక్. 2016 నుంచి ఈ సంస్థే పాక్ లీగ్‌కు టైటిల్‌ను స్పాన్సర్‌గా ఉంది.