తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాకిస్థాన్​లో క్రికెట్​ జోరు.. 2021లో అగ్ర దేశాలకు ఆతిథ్యం

పాకిస్థాన్​లో అంతర్జాతీయ క్రికెట్​ పునరుజ్జీవం కోసం ఆ దేశ క్రికెట్​ బోర్డు తీవ్రంగా శ్రమిస్తోంది. ఉగ్రవాద దేశంగా ఉన్న ముద్రను చెరిపేసుకొనేందుకు పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలో పలు అంతర్జాతీయ, ద్వైపాక్షిక టోర్నీలకు ఆతిథ్యమివ్వాలని భావిస్తోంది. వచ్చేఏడాదిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ లాంటి అగ్ర​ దేశాలను తమ దేశానికి ఆహ్వానిస్తోంది పాక్.

pakistan cricket news
2021లో టాప్​ దేశాలకు ఆతిథ్యమిస్తున్న పాక్​

By

Published : Nov 21, 2020, 5:35 PM IST

పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ మళ్లీ సందడి చేయనుంది. ఎన్నో ఏళ్లుగా ఇబ్బందుల్లో పడిన ఆట​ను మళ్లీ పునరుద్ధరించేందుకు ఆ దేశ క్రికెట్​ బోర్డు నడుం బిగించింది. ఇందులో భాగంగానే ఐసీసీ సభ్య దేశాలన్నీ తమగడ్డపై అడుగుపెట్టేలా ఆహ్వానాలు పంపిస్తూ, చర్చలు జరుపుతోంది. అయితే ఇవి సత్ఫలితాలిస్తున్నాయి. ఫలితంగానే వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్​, ఇంగ్లాండ్​, వెస్టిండీస్​ దేశాలు పాక్​లో అడుగుపెట్టేందుకు అంగీకారం తెలిపాయి.

దక్షిణాఫ్రికా

వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికా జట్టు పాక్​లో అడుగుపెట్టనుంది. ఇరుజట్ల మధ్య రెండు టెస్టు​ల సిరీస్​ జరగనుంది. వీటితో పాటు మూడు టీ20లు కూడా నిర్వహించనున్నారు.

న్యూజిలాండ్​

వచ్చే సెప్టెంబర్​లో పాక్​తో మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది న్యూజిలాండ్​. కరాచీలో రెండు టీ20లు జరగనున్నాయి. 2005లో చివరగా పాకిస్థాన్​లో అడుగుపెట్టిన ఈ జట్టు.. దాదాపు 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ గడ్డపై కాలుమోపనుంది.

వెస్టిండీస్​

స్వదేశంలో వెస్టిండీస్​తోనూ ఓ సిరీస్​ ఆడాలని భావిస్తోంది పాక్​. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వచ్చే డిసెంబర్​లో ఈ మ్యాచ్​లు నిర్వహించనున్నారు.

ఆస్ట్రేలియాతోనూ..

ప్రస్తుతం ఆస్ట్రేలియాతోనూ చర్చలు జరుపుతున్నట్లు పాక్​ బోర్డు పేర్కొంది. 2022లో ఆ జట్టు తమ దేశంలో పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పీసీబీ తెలిపింది.

అఫ్గానిస్థాన్​తోనూ వచ్చే ఏడాది కొన్ని పరిమిత ఓవర్ల మ్యాచ్​లు ఆడించాలని పాకిస్థాన్ యోచనలో ఉంది​.

ఇదీ జరిగింది..

2009 మార్చిలో పాక్​లో పర్యటించిన శ్రీలంక ఆటగాళ్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ఘటనలో ఆరుగురు పోలీసులు, ఇద్దరు పౌరులు మృతి చెందగా ఆరుగురు లంక క్రికెటర్లకు గాయలయ్యాయి. అప్పటి నుంచి దక్షిణాసియా దేశాలు పాక్​లో పర్యటించేందుకు ఆసక్తి కనబర్చలేదు. ఆ తర్వాత నుంచి పాక్​ ఆడే ద్వైపాక్షిక సిరీస్​లు, అంతర్జాతీయ మ్యాచ్​లన్నీ తటస్థ వేదికైన యూఏఈలో జరిగేవి. అయితే 2015లో మళ్లీ పాక్​లో తొలిసారి కాలుమోపింది జింబాబ్వే జట్టు. లాహోర్​ వేదికగా ఇరుజట్ల మధ్య పరిమిత ఓవర్ల మ్యాచ్​లు జరిగాయి. గతేడాది సెప్టెంబర్​ 27 నుంచి అక్టోబర్​ 9 వరకు పాక్​లో పర్యటించింది లంక జట్టు. అనంతరం బంగ్లాదేశ్​ కూడా అక్కడ అడుగుపెట్టింది. ఇటీవల కాలంలో పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ను దిగ్విజయంగా నిర్వహించింది పాకిస్థాన్​. ఈ టోర్నీలో డేల్​ స్టెయిన్​, షేన్​ వాట్సన్​, ఏబీ డివిలియర్స్​ లాంటి అంతర్జాతీయ క్రికెటర్లు కనువిందు చేశారు.

భద్రతతోనే..

పాకిస్థాన్​ సూపర్​ లీగ్​ అద్భుతంగా నిర్వహించడం, ఆటగాళ్ల భద్రతపై ఎక్కువగా దృష్టి పెట్టడం వంటి కారణాలను పాక్​ బోర్డు తమ విజయాలుగా పేర్కొంటోంది. అంతర్జాతీయ క్రికెటర్ల కోసం ఆర్మీ సహకారంతో దేశాధ్యక్షుడి స్థాయి భద్రతను కల్పిస్తున్నట్లు చెప్తోంది.

భారత్​తో మాత్రం కష్టమే..

భారత్‌-పాకిస్థాన్ దాయాది జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగితే అది ప్రపంచ క్రికెట్‌కు మంచిదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. అయితే ఉగ్రవాద నిర్మూలన చేపట్టకపోవడం సహా సరిహద్దుల్లో దాడులకు పాల్పడటం లాంటి చర్యల వల్ల ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మెరుగుపడట్లేదు. ఈ నేపథ్యంలోనే ఇరుదేశాల మధ్య క్రికెట్​కు బ్రేక్​ పడింది.

చివరగా 2013 జనవరిలో పాక్‌ జట్టు భారత్‌లో రెండు టీ20లు, మూడు వన్డేలు ఆడింది. అప్పటి నుంచి ఇరు జట్ల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ, లేదా ఆసియా కప్‌ల సందర్భంగానే తలపడుతున్నాయి. ఇక 2007-2008 సీజన్‌లో ఇరు జట్లూ చివరి సారి టెస్టు సిరీస్‌ ఆడాయి.

ABOUT THE AUTHOR

...view details