టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కంటే ఎంతో మంది మెరుగైన క్రికెటర్లు పాకిస్థాన్‌లో ఉన్నారని ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. కానీ వారు తమ ప్రతిభను చూపించలేకపోతున్నారని చెప్పాడు.
"పాక్‌లో కోహ్లీ కంటే గొప్ప ఆటగాళ్లు ఎంతో మంది ఉన్నారని నేను నమ్ముతున్నా. కానీ వారు వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం ఎంతో బాధాకరం. కానీ కోహ్లీ అలా కాదు. తనపై బోర్డు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. మంచి ప్రదర్శనలు చేస్తూ తన ప్రతిభ ఏంటో అందరికీ తెలియజేస్తున్నాడు. అతడో అద్భుతమైన ఆటగాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు. బీసీసీఐ మద్దతు ఇవ్వడం కోహ్లీకి సానుకూలాంశం. ఏ ఆటగాడయినా రాణించాలంటే బోర్డు వారిపై విశ్వాసం ఉంచాలి. ఈ విషయంలో కోహ్లీ అదృష్టవంతుడు. బీసీసీఐ పెట్టుకున్న నమ్మకమే అతడు ఉత్తమ ప్రదర్శనలు చేయడానికి ప్రేరణగా నిలుస్తోంది. దానితో అతడు ఎలాంటి ప్రదర్శనలు చేస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం"
-అబ్దుల్ రజాక్, పాక్ మాజీ క్రికెటర్