పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఉమర్ అక్మల్ ఖాతాలో చెత్త రికార్డు చేరింది. టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా.... శ్రీలంక బ్యాట్స్‌మెన్ దిల్షాన్(10) సరసన చేరాడు. దాదాపు మూడేళ్ల తర్వాత శ్రీలంకతో టీ20 సిరీస్‌లో బరిలోకి దిగాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తొలి బంతికే ఔటయ్యాడు. ఇప్పటివరకు పొట్టి ఫార్మాట్లో 10 సార్లు డకౌట్ అయిన అక్మల్.... అందులో 6సార్లు గోల్డెన్ డకౌట్ కావడం విశేషం.
సిరీస్ కైవసం చేసుకున్న లంక
పాక్ పర్యటనలో శ్రీలంక కుర్రాళ్లు అదరగొట్టారు. లాహోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో పాకిస్థాన్‌ను 35 పరుగుల తేడాతో ఓడించారు. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. రాజపక్స (77) అర్ధశతకంతో రాణించాడు. జయసూర్య (34), డసన్(27) ఫర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో వసీమ్, వాహబ్ రియాజ్, షాదబ్ ఖాన్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో పాక్.. 147 పరుగులకే కుప్పకూలింది. లంక బౌలర్ల ధాటికి 52 పరుగులకే సగం వికెట్ల కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
పాక్ బ్యాట్స్‌మెన్ అసిఫ్ అలీ (29), వసీమ్ (47) పోరాడటం వల్ల ఘోర ఓటమి నుంచి తప్పించుకుంది. ప్రదీప్ (4/25), హసరంగ (3/38), ఉదానా (2/38) కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
తొలి మ్యాచ్‌లో పాక్‌పై శ్రీలంక 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లాహోర్ వేదికగా బుధవారం ఆఖరి టీ20 జరగనుంది.