దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) ద్విశతకానికి చేరువైన వేళ వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. దీనిపై జమాన్ స్పందిస్తూ అందులో తన తప్పే ఉందని, క్వింటన్ డికాక్ తప్పు లేదని స్పష్టం చేశాడు. మరోవైపు డికాక్ ఉద్దేశపూర్వకంగానే తమ బ్యాట్స్‌మన్ దృష్టి మరల్చాడని పాకిస్థాన్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.
అసలేం జరిగిందంటే..
బుధవారం ఇరు జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ చేసింది. డికాక్(80), కెప్టెన్ బవుమా(92), వాండర్ డసెన్(60), మిల్లర్(50) అర్ధ శతకాలతో రాణించారు. ఛేదనలో పాక్ 324/9 స్కోర్ సాధించి 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే చివరి ఓవర్‌లో పాక్ 31 పరుగులు చేయాల్సిన స్థితిలో జమాన్ 192 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్‌లో హారిస్ రౌఫ్(1) ఉన్నాడు. అయితే, ఎంగిడి వేసిన తొలి బంతికి డబుల్ రన్ తీయబోయిన జమాన్ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో రనౌటయ్యాడు. ఫీల్డర్ మార్‌క్రమ్ డైరెక్ట్ త్రో విసరాడు. దీంతో అతడు ఔటయ్యాడు. కానీ, ఇక్కడే ఓ ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
ఇదీ చదవండి:రనౌట్ కోసం డికాక్ ట్రిక్- మాజీల ఆగ్రహం
జమాన్ రెండో పరుగు కోసం క్రీజులోకి వస్తుండగా దక్షిణాఫ్రికా కీపర్ క్వింటన్ డికాక్ చేసిన ఓ సైగ వివాదాస్పదమైంది. ఫీల్డర్.. బంతిని నాన్‌స్ట్రైకర్ వైపు విసురుతున్నట్లు చేయి ఊపడం, అప్పుడే జమాన్ అవతలి వైపు చూడటం, బంతి వికెట్లకు తాకడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇదంతా తర్వాత రీప్లేలో కనిపించింది. దీంతో పాక్ అభిమానులు డికాక్‌పై మండిపడుతున్నారు. డికాక్ ఉద్దేశపూర్వకంగా మాయ చేశాడని, జమాన్ వన్డేల్లో రెండో ద్విశతకం సాధించకుండా చేశాడని తప్పుబట్టారు. అది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టాడు. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం మాట్లాడిన జమాన్ తన రనౌట్ విషయంలో తప్పు తనదేనని ఒప్పుకున్నాడు.
తప్పు నాదే..
"అది నా తప్పే. ఎందుకంటే నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో పరుగెడుతున్న హారిస్ రౌఫ్ క్రీజులో నుంచి కాస్త ఆలస్యంగా కదిలాడు. దీంతో నేను అతడి వైపు చూశాను. ఆ సమయంలో అతడు రనౌట్ అవుతాడేమోనని భావించా. ఇక తర్వాత ఏం జరిగినా మ్యాచ్ రిఫరీ చూసుకుంటాడు. కానీ, అందులో డికాక్ తప్పేమీ లేదు. నేనీ మ్యాచ్‌లో చాలా అద్భుతంగా ఆడాను. కానీ, మా జట్టు విజయం సాధించి ఉంటే ఇంకా బాగుండేది" అని జమాన్ వివరించాడు.
కాగా, జమాన్ 193 పరుగుల వద్ద ఔటైనా ఓ గొప్ప రికార్డు నెలకొల్పాడు. వన్డే ఛేదనల్లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు. ఇదివరకు షేన్ వాట్సన్(185*), ధోనీ(183*), విరాట్ కోహ్లీ(183) ఆ ఘనత సాధించారు.
ఇదీ చదవండి:బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌గా మాజీ డీజీపీ