తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​ కోచ్​గా మిస్బా.. బౌలింగ్ కోచ్​గా వకార్​

ప్రపంచకప్​లో పాకిస్థాన్​ విఫలమైన కారణంగా ఆ జట్టు కోచ్ మిక్కీ ఆర్థర్​ కాంట్రాక్ట్​ను పొడిగించని విషయం తెలిసిందే. ఇప్పుడు పాక్ కోచ్​ బాధ్యతలను ఆ దేశ మాజీ సారథి మిస్బా ఉల్​ హఖ్​కు అప్పగించింది పీసీబీ.

మిస్బా ఉల్ హఖ్

By

Published : Sep 4, 2019, 2:35 PM IST

Updated : Sep 29, 2019, 10:10 AM IST

పాకిస్థాన్ చీఫ్ సెలక్టర్, హెడ్​ కోచ్​గా ఆ దేశ మాజీ క్రికెటర్ మిస్బా ఉల్ హఖ్​ ఎంపికయ్యాడు. ఈ పదవిలో అతడు మూడేళ్లు కొనసాగనున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తెలిపింది. బౌలింగ్ కోచ్​గా వకార్ యూనిస్​ బాధ్యతలు అప్పగించింది. మూడేళ్ల కాలానికి అతడితో ఒప్పందం చేసుకుంది.

"మాజీ సారథి మిస్బా ఉల్​ హఖ్​ను పాకిస్థాన్​ హెడ్ కోచ్, చీఫ్ సెలక్టర్​గా ఎంపిక చేస్తున్నాం. మూడేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అన్ని స్థాయిల్లో ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది" -పీసీబీ ప్రకటన

ఇప్పటివరకు కోచ్​గా ఉన్న మిక్కీ ఆర్థర్ కాంట్రాక్ట్​ను పీసీబీ పొడిగించలేదు. 2019 ప్రపంచకప్​లో పాక్ సెమీస్​ కూడా చేరకుండానే ఇంటిముఖం పట్టింది. ఈ కారణంగా బౌలింగ్ కోచ్ అజార్ మహ్మద్, బ్యాటింగ్ కోచ్​ గ్రాంట్ ఫ్లవర్​నూ వెనక్కిపంపింది పీసీబీ.

"పాకిస్థాన్ కోచ్​గా​ నన్ను ఎంపికచేశారంటే.. నా మీద అంచనాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకు సిద్ధంగా ఉన్నా. ఒకవేళ వాటిని అందుకోలేకపోతే ఈ గౌరవానికి నా పేరును ప్రతిపాదించేవాడినే కాదు. ప్రతిభగల యువ క్రీడాకారులు చాలా మంది ఉన్నారు. వారిని ప్రోత్సహిస్తాను" - మిస్బా ఉల్ హఖ్​,పాక్ మాజీ సారథి

స్వదేశంలో సెప్టెంబర్ 27 నుంచి శ్రీలంకతో టీ20లు ఆడనుంది పాకిస్థాన్. ఈ సిరీస్​ నుంచే మిస్బా పాక్ 30వ కోచ్​గా బాధ్యతలు తీసుకోనున్నాడు. నవంబరులో ఆస్ట్రేలియాలోనూ పర్యటించనుంది దాయాది జట్టు.

56 టెస్టుల్లో పాక్​ జాతీయ జట్టుకు సారథ్యం వహించాడు మిస్బా. అందులో 27 విజయాలతో ఆ దేశం తరపున అత్యధిక మ్యాచ్​లు గెలిపించిన టెస్టు కెప్టెన్​గా రికార్డు సృష్టించాడు. 75 టెస్టులు, 162 వన్డేలు, 39 టీ ట్వంటీలకు ప్రాతినిధ్యం వహించిన మిస్బా 2017లో వీడ్కోలు పలికాడు.

ఇది చదవండి: స్కేటర్​కు ఘోర ప్రమాదం తప్పింది.. లేదంటే..!

Last Updated : Sep 29, 2019, 10:10 AM IST

ABOUT THE AUTHOR

...view details