పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ షాట్లు ఆడేందుకు భయపడుతున్నారని ఆ దేశ మాజీ క్రికెటర్ ఇంజమామ్ ఉల్ హక్ అన్నాడు. ఇంగ్లాండ్‌పై రక్షణాత్మక విధానాన్ని తప్పుబట్టాడు. వ్యూహాలు మార్చుకోవాలని బ్యాట్స్‌మెన్, జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఆతిథ్య జట్టును రెండో టెస్టులో ఓడించి మూడు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే దూకుడుగా ఆడాలని పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానల్‌లో ఇంజీ మాట్లాడాడు.
"షాట్లు ఆడేందుకు పాక్ బ్యాట్స్‌మెన్ జంకుతున్నారు. వారు ఔటైన విధానం చూస్తే వారి బ్యాట్లు కాళ్ల వెనకనే ఉంటున్నట్టు కనిపిస్తోంది. బంతిని ఆడాలంటే బ్యాటును కాళ్ల ముందుకు తీసుకురావాలి. మీ రక్షణాత్మక విధానం వల్లే స్లిప్‌లో దొరికిపోతున్నారు. ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే దూకుడుగా క్రికెట్ ఆడాలని బ్యాట్స్‌మెన్, జట్టు యాజమాన్యానికి సూచిస్తున్నా. లేదంటే మ్యాచును రక్షించుకొనేందుకు వర్షంపై ఆధారపడాలి."