ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపైనే ఓడించి భారత్ టెస్టు సిరీస్ గెలిచి నేటికి ఏడాది పూర్తయింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో కంగారూ గడ్డపై ట్రోఫీ గెలిచిన తొలి ఆసియా దేశంగా రికార్డు సృష్టించింది భారత్. 2018 డిసెంబర్లో ఈ సిరీస్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియాపై నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది కోహ్లీసేన. ఆ గెలుపును గుర్తుచేసుకుంటూ, ఏడాది పూర్తయిన సందర్భంగా ఫొటోలు షేర్ చేసింది బీసీసీఐ.
ప్రపంచకప్ కన్నా ఎక్కువ
టెస్టు సిరీస్ గెలిచిన అనంతరం భారత ఆటగాళ్లంతా భావోద్వేగం వ్యక్తం చేశారు. 2011 ప్రపంచకప్ కన్నా ఈ గెలుపు ఎక్కవ ఆనందం ఇచ్చిందని హర్షం వ్యక్తం చేశాడు సారథి కోహ్లీ.
ట్రోఫీని ముద్దాడుతూ కోహ్లీ
" ఇప్పటివరకు నా కెరీర్‌లో ఇదే అతిపెద్ద విజయం. ఈ క్షణం ఎంతో సంతోషంగా ఉంది. 2011 ప్రపంచకప్ గెలిచినప్పుడు జట్టులో నేనే చిన్నవాడిని. అప్పుడు ఇతర ఆటగాళ్లంతా భావోద్వేగం చెందినా, నాకేం అనిపించలేదు. ఆస్ట్రేలియాలో మూడుసార్లు పర్యటించినా ఈ విజయం ఎంతో అమూల్యం. ఈ గెలుపు మాకో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. ఇప్పుడు చాలా గర్వంగా ఫీలవుతున్నా"
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
71 ఏళ్లకు కల సాకారమైతే
1947 నుంచి ఆస్ట్రేలియా పర్యటనకు చాలా సార్లు వెళ్లిన భారత్... గతేడాది వరకు ఒక్క టెస్టు సిరీస్ గెలుపొందలేదు. కానీ టీమిండియా అత్యుత్తమ కెప్టెన్ల్లో ఒకడైన ప్రస్తుత సారథి కోహ్లీ నాయకత్వంలోని ఆ లోటును తీర్చింది. సరిగ్గా 71 ఏళ్ల తర్వాత 2019 జనవరి 7న చరిత్ర సృష్టిస్తూ... ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ముద్దాడింది.
ఈ సిరీస్‌లో అత్యధిక పరుగులు(521) చేసిన బ్యాట్స్‌మన్‌గా పుజారా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ బుమ్రా... ఆసీస్ క్రికెటర్ లయన్‌తో చోటు పంచుకున్నాడు. మొత్తంగా 21 వికెట్లు తీసిన బుమ్రా... ఐదు వికెట్ల ఘనతనూ సాధించాడు. మహ్మద్ షమి(16 వికెట్లు), ఇషాంత్ శర్మ(11 వికెట్లు) తీసి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.
సిరీస్ విజయోత్సవంలో భారత్
ఇలా సాగింది
>> అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 250 పరుగులు చేయగా, పుజారా(123) శతకంతో మెరిశాడు. ఛేదనలో ఆసీస్ 235 పరుగులకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులు చేసిన టీమిండియా.. ఆసీస్‌ను 291 పరుగులకు ఆలౌట్ చేసింది.
>> పెర్త్ వేదికగా రెండో టెస్టులో ఆసీస్ పుంజుకొని 146 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమమైంది.
>> మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో పుజారా(106) మళ్లీ శతకంతో రాణించగా.. భారత్ 443/7 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కంగారూలు 151 పరుగులకే ఆలౌటయ్యారు. టీమిండియా 106/8తో రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, ఆతిథ్య జట్టు 261 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా టీమిండియా 137 పరుగులతో విజయం సాధించింది.
>> సిడ్నీ వేదికగా జరిగిన నాలుగో టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. ఫలితంగా కోహ్లీసేన 2-1 తేడాతో ఆసీస్ గడ్డపై తొలిసారి టెస్టు సిరీస్ విజయం సాధించింది.
ఈ అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్ కోసం భారత్ సిద్ధమవుతోంది. 2013 తర్వాత ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవని టీమిండియా.. ఈ సారి కప్ కొట్టాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఇదే ఏడాది నవంబర్- జనవరి మధ్య ఆసీస్‌తో టెస్టు సిరీస్‌లు వాళ్ల దేశంలో ఆడనుంది భారత్. మరి అద్భుత ప్రదర్శనతో రాణిస్తున్న కోహ్లీ.. ఈసారీ ట్రోఫీ గెలిస్తే మళ్లీ చరిత్ర సాధ్యమే.