టీమ్ఇండియాకు కెప్టెన్‌గా ధోనీ మూడు ఐసీసీ ట్రోఫీలు తెచ్చినా.. సౌరభ్ గంగూలీ నాయకత్వం జట్టుపై అత్యంత ప్రభావం చూపిందని అభిప్రాయపడ్డాడు భారత క్రికెటర్ పార్థివ్ పటేల్. భారత క్రికెట్ గందరగోళంలో ఉన్నప్పుడు గంగూలీ జట్టు పగ్గాలు స్వీకరించి టీమ్‌ను గాడిలో పెట్టాడని తాజాగా ఓ ఇంటర్వ్యులో తెలిపాడు. ధోనీ గురించి మాట్లాడాలంటే కేవలం మూడు ట్రోఫీలు మాత్రమేనని వెల్లడించాడు.
"ధోనీ, గంగూలీల మధ్య పోటీ చెల్లుతుంది. వీరిలో ఒక కెప్టెన్ చాలా ట్రోఫీలు సాధించగా.. మరొకరు జట్టును పూర్తిస్థాయిలో నిర్మాణం చేయడంలో పాటుపడ్డారు. 2000లో సౌరభ్ గంగూలీ సారథి అయినప్పుడు టీమ్ఇండియా చాలా కష్టాల్లో ఉంది. అంతకుముందు టోర్నీల్లో సరిగా ప్రదర్శన చేయలేకపోయినా.. దాదా వచ్చిన తర్వాత విదేశాల్లో జట్టు రాణించగలిగింది. ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్‌లు గెలిచాం. ఆ తర్వాత పాకిస్థాన్‌పై కూడా టెస్టు సిరీస్ నెగ్గాం. 2003 ప్రపంచకప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుతుందని ఎవరూ ఊహించలేదు."