కోహ్లీ.. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోన్న పేర్లలో ఒకటి. మైదానంలోకి దిగితే సెంచరీయే అన్న విధంగా తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. ఈ దశాబ్దంలో మేటి బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడు తొలి వన్డే సెంచరీ సాధించింది నేటికి సరిగ్గా 10 ఏళ్ల క్రితం.
శ్రీలంకతో మ్యాచ్
అది2009 డిసెంబర్ 24.. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో మ్యాచ్. మొదట బ్యాటింగ్ చేసిన లంక.. ఉపుల్ తరంగ (118) వీరవిహారంతో ఏకంగా 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. గెలవాలంటే భారత్ లక్ష్యం 316. 23 పరుగులకే దిగ్గజ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్ పెవిలియన్ బాట పట్టారు. అప్పుడు క్రీజులోకి వచ్చాడు కింగ్ కోహ్లీ. గౌతమ్ గంభీర్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే విరాట్.. వన్డేల్లో తొలి సెంచరీని సాధించాడు. గౌతీతో కలిసి నాలుగో వికెట్‌కు 224 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అనంతరం 107 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. 150 పరుగులతో గంభీర్ అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా.. 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఇప్పటివరకు వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు కోహ్లీ. 2019లో ఈ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ మొదటి స్థానంలో ఉన్నాడు. టెస్టుల్లో ఇప్పటివరకు 27 సెంచరీలు కింగ్ కోహ్లీ పేరుమీద ఉన్నాయి.
ఇవీ చూడండి.. 'న్యూజిలాండ్ పర్యటనలో రాణించడమే లక్ష్యం'