సచిన్ తెందుల్కర్.. ఈ పేరు వినగానే లెక్కలేనన్ని రికార్డులు, క్రికెట్లో అత్యధిక పరుగులు గుర్తొస్తాయి. కానీ వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు.. తొలి సెంచరీ చేయడానికి ఐదేళ్లు పట్టిందంటే మీరు నమ్మగలరా? అవును ఇదే రోజు(1994 సెప్టెంబరు 9).. 26 ఏళ్ల క్రితం సింగర్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాపై తొలి శతకం నమోదు చేశాడు మాస్టర్.
కొలంబో వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్. అది సచిన్ 78వ వన్డే. తొలుత టీమ్ఇండియా బ్యాటింగ్. ఓపెనర్‌గా వచ్చిన సచిన్, క్రీజులో బలంగా పాతుకుపోయాడు. మిగతా క్రికెటర్లందరూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌కు పంపించేసిన ఆసీస్ బౌలర్లు.. మాస్టర్‌ను మాత్రం త్వరగా ఔట్ చేయలేకపోయారు. ఎట్టకేలకు 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడి వికెట్ తీయగలిగారు.
ఈ మ్యాచ్‌లో సచిన్ (110), కాంబ్లీ (43) భాగస్వామ్యంతో టీమ్ఇండియా, నిర్ణీత 50 ఓవర్లలో 246 పరుగులు చేసింది. ఛేదనలో ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 215 పరుగులకే కుప్పకూలింది.