సరిగ్గా 9 ఏళ్ల క్రితం.. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య సెమీఫైనల్. లీగ్‌లో అద్భుతంగా ఆడిన ఇరుజట్లు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగాయి. మొహలీ స్టేడియం వేదిక. దాయాదిపై మెగాటోర్నీలో ఓటమే ఎరుగని టీమిండియా.. ఇక్కడా అదే ఊపును కొనసాగించింది. అనంతరం ఫైనల్‌కు చేరి, లంకపై గెలిచింది. 28 ఏళ్ల తర్వాత కప్పు అందుకుంది.
సెహ్వాగ్-సచిన్‌ల అండతో
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. పాక్ బౌలర్లపై ఓపెనర్లు అధిపత్యాన్ని చలాయించారు. మూడో ఓవర్లోనే పేసర్ గుల్కు చుక్కలు చూపిస్తూ.. 21 పరుగులు పిండుకున్నాడు సెహ్వాగ్. అతడిని బౌలర్ వాహబ్ రియాజ్ అడ్డుకున్నాడు. దీంతో 38 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. మరో ఓపెనర్ సచిన్‌కు నాలుగుసార్లు జీవదానం లభించడం వల్ల 85 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సచిన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ అంతా వచ్చినవారు వచ్చినట్లుగా పెవిలియన్ చేరుతుంటే భారత్ కనీసం 250 పరుగులైనా చేయగలుగుతుందా అనే సందేహం కలిగింది. అయితే చివర్లో బ్యాటింగ్‌కు దిగిన సురేశ్ రైనా(39), ధోనీ(25)ల సాయంతో టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేయగలిగింది.