మహేంద్ర సింగ్ ధోనీ.. కెరీర్ ప్రారంభంలో ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించాడు. కానీ తన కెరీర్లో తొలి సెంచరీ మీకు గుర్తుందా. అంత తేలికగా మరచిపోలేదనుకుంటా. ఎందుకంటే అది ధోనీకి కెరీర్లో తొలి సెంచరీ. అదీ దాయాది దేశం పాకిస్థాన్‌పై. ఈ అపురూప ఇన్నింగ్స్‌కు వేదికైంది వైజాగ్ స్టేడియం.
ఏప్రిల్ 5, 2005. పాకిస్థాన్‌తో ఆరు వన్డేల సిరీస్‌లో రెండో మ్యాచ్. మొదట టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. నాలుగో ఓవర్లోనే సచిన్ ఔటయ్యాడు. అంతే ధోనీ మైదానంలోకి వచ్చాడు. మరో ఓపెనర్ సెహ్వాగ్‌తో కలిసి పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు మహీ. వీరిద్దరూ రెండో వికెట్‌కు 96 పరుగులు జోడించారు. అనంతరం 74 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సెహ్వాగ్ పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన ద్రవిడ్‌తో కలిసి మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు ధోనీ. మూడో వికెట్‌కు 149 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.