తెలంగాణ

telangana

ETV Bharat / sports

లక్ష్మణ్-ద్రవిడ్ సంచలన ఇన్నింగ్స్​కు 20 ఏళ్లు - క్రికెట్ లేటేస్ట్ న్యూస్

ఈడెన్ గార్డెన్​ వేదికగా 2001లో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు, అద్భుతమైన మ్యాచ్​ల్లో ఒకటి.​ అందుకు కారణం టీమ్​ఇండియా క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్​ల ఇన్నింగ్స్. ఆదివారానికి ఈ ఇన్నింగ్స్​కు సరిగ్గా 20 ఏళ్లు పూర్తయ్యాయి.

On This Day In 2001, VVS Laxman, Rahul Dravid Batted Whole Day To Set Up Famous Win At Eden Gardens
లక్ష్మణ్-ద్రవిడ్ సంచలన ఇన్నింగ్స్​కు 20 ఏళ్లు

By

Published : Mar 14, 2021, 2:27 PM IST

క్రికెట్​లో మరపురాని ఇన్నింగ్స్​లు కొన్ని ఉంటాయి. వాటిని క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. క్రికెట్ మక్కాగా పిలిచే ఈడెన్ గార్డెన్​లో ఆస్ట్రేలియాతో భారత్ ఆడిన టెస్టు ఆ కోవలోకే వస్తుంది. ఈ మ్యాచ్​లో టీమ్​ఇండియా బ్యాట్స్​మన్ వీవీఎస్ లక్ష్మణ్ 281 పరుగుల ఇన్నింగ్స్​ చరిత్రలో నిలిచిపోయింది. అతడికి తోడు ద్రవిడ్ బ్యాటింగ్, అసలు గెలుస్తామన్న నమ్మకంలేని మ్యాచ్​ను విజయం సాధించేలా చేసింది.

ఇదీ దానివెనకున్న కథ

వరుసగా 15 టెస్టుల్లో విజయం సాధించి ఎదురులేని జట్టుగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా.. 2001లో భారత పర్యటనకు వచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌లో ముంబయిలో జరిగిన తొలి మ్యాచ్​లో గెలిచింది. కోల్​కతాలోని రెండో టెస్టులో విజయం సాధించి, సిరీస్​ సొంతం చేసుకోవాలనుకుంది.

అయితే ఈడెన్‌ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్​లో పట్టుదలతో బరిలోకి దిగింది టీమ్​ఇండియా. స్టీవ్‌ వా (110), హెడెన్‌ (97) రాణించడం వల్ల ఆసీస్‌, తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్​ మొదలుపెట్టిన భారత్​ను ఆసీస్‌ బౌలర్లు బెంబేలెత్తించారు. లక్ష్మణ్‌ (59) మినహా ఎవరూ రాణించకపోవడం వల్ల భారత్‌ 171 పరుగులకే కుప్పకూలింది. ఐదో స్థానంలో వచ్చిన లక్ష్మణ్‌.. చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆసీస్‌.. గంగూలీ సేనను ఫాలోఆన్‌ ఆడించింది.

వీవీఎస్ లక్ష్మణ్-రాహుల్ ద్రవిడ్

లక్ష్మణ్, ద్రవిడ్

రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్‌.. ఆదిలోనే తొలి వికెట్‌ కోల్పోయింది. రెండు రోజులకు పైగా ఆట ఉండటం వల్ల ఆసీస్‌ బౌలర్లను అడ్డుకుని మ్యాచ్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఆ సమయంలో ద్రవిడ్‌కు బదులు వన్‌డౌన్‌లో లక్ష్మణ్‌ను పంపించాలని అనుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగిన లక్ష్మణ్‌.. కనీసం కాళ్లకు ప్యాడ్‌ అయినా విప్పలేదు. కొద్దిసేపే విశ్రాంతి తీసుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. ఆసీస్‌ బౌలర్లను సమర్థమంతంగా ఎదుర్కొని స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.

దాస్ (39), సచిన్ (10) వెనుదిరిగినా గంగూలీ (48)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దాదా ఔటైన తర్వాత ద్రవిడ్‌ (180)తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్‌ బౌలర్లపై విజృంభించి ద్విశతకాన్ని చేశాడు. స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ, ట్రిపుల్‌ సెంచరీ అందుకునే దిశగా పయనించాడు. కానీ మెక్‌గ్రాత్‌ బౌలింగ్‌లో ఔటై, 281 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. ద్రవిడ్‌, లక్ష్మణ్‌ అసాధారణమైన పోరాట ఫలితంగా భారత్‌, రెండో ఇన్నింగ్స్‌ను 629/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది.

అనంతరం భారత బౌలర్లు చెలరేగడం వల్ల ఆసీస్‌ 212 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియా 171 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అప్పట్లో ఈ మ్యాచ్‌ సంచలనంగా మారింది. ఫాలోఆన్‌కు దిగిన గంగూలీ సేన బలమైన ఆసీస్‌పై గెలవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆఖరి టెస్టులోనూ భారత జట్టే గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవడం మరో విశేషం.

ABOUT THE AUTHOR

...view details