తెలంగాణ

telangana

ETV Bharat / sports

'1983 ప్రపంచకప్' మధుర క్షణాలకు 37 ఏళ్లు - KAPIL DEV WITH CUP

టీమ్​ఇండియా.. తొలి వన్డే ప్రపంచకప్​ గెలిచి 37 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అప్పటి జట్టు సభ్యులు, ఆనాటి జ్ఞాపకాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

'1983 ప్రపంచకప్' మధుర క్షణాలకు 37 ఏళ్లు
'1983 ప్రపంచకప్' కపిల్ దేవ్

By

Published : Jun 25, 2020, 9:52 AM IST

1983 వన్డే ప్రపంచకప్ ఫైనల్. భారత్-వెస్టిండీస్ మ్యాచ్​. అప్పటికే రెండుసార్లు కప్పు గెలుచుకోవడం వల్ల విండీస్​దే విజయమని అంతా భావించారు. కానీ తొలుత బ్యాటింగ్​కు దిగి, తక్కువ స్కోరు చేసిన భారత్.. ప్రత్యర్థిని తన అభేద్యమైన బౌలింగ్​తో అడ్డుకోగలిగింది. తద్వారా తొలిసారి ప్రపంచకప్​ను ముద్దాడింది. ఆ మధుర క్షణాలకు నేటితో 37 ఏళ్లు. ఈ సందర్భంగా ఆ విశేషాలు మీకోసం.

1983 ప్రపంచకప్‌ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కపిల్‌దేవ్‌. భారత క్రికట్‌ ప్రస్థానంలో అతడో సంచలనం. అతడి కెప్టెన్సీ ఓ చరిత్ర. అతడి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన అమోఘం. ఒక్కమాటలో చెప్పాలంటే.. '1983 ప్రపంచకప్‌ భారత్‌ గెలిచింది' అనేకన్నా 'కపిల్‌దేవ్‌ గెలిపించాడు' అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా పేరుగాంచిన కపిల్‌ భారత్‌లో ఎంతో మంది క్రికెటర్లకు ఆదర్శప్రాయుడయ్యాడు. అతడి ఆటతీరుతో యావత్‌ క్రీడాలోకాన్నే ఔరా అనిపించాడు. ఏమాత్రం అంచనాల్లేని టీమిండియాని ఏకంగా విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ను మట్టికరిపించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడాడు. ఇక అప్పుడు మొదలైంది అసలు మజా. క్రికెట్‌ కనిపెట్టిన ఆ దేశంలో కన్నా భారత్‌లోనే ఈ ఆటకు అభిమానులు ఎక్కువయ్యారు. మరోమాటలో చెప్పాలంటే ఇక్కడ క్రికెట్‌ మతంలా మారింది. అందుకు కారణం ది గ్రేట్‌ లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌.

1983 ప్రపంచకప్​తో అప్పటి జట్టు కెప్టెన్ కపిల్​దేవ్

అంచనాల్లేని జట్టుగా తొలి అడుగు

కపిల్‌ సారథ్యంలోని టీమిండియా 14 మంది బృందంతో ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది. అప్పటికీ జట్టులో సునీల్‌ గావస్కర్‌, దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌, మదన్‌లాల్‌, రవిశాస్త్రి, సందీప్‌పాటిల్‌, రోజర్ బిన్నీ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. అయినా ఈ దిగ్గజాలపై ఎవరికీ అంచనాల్లేవు. మొత్తం ఎనిమిది జట్లు.. ఆ ప్రపంచకప్‌లో పాల్గొనగా రెండు గ్రూపులుగా నాలుగేసి జట్లను విభజించారు. భారత్‌ ఉన్న విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్ వెస్టిండీస్‌తో పాటు మరో పెద్ద జట్టు ఆస్ట్రేలియా, జింబాబ్వే ఉన్నాయి. వీటిపై గెలిచి భారత్‌ సెమీస్‌ అయినా చేరుతుందని ఎవరూ ఊహించలేదు. అలాంటి స్థితిలోనే మొదటి లీగ్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపొంది ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అనంతరం రెండో మ్యాచ్‌లో జింబాబ్వేను 155 పరుగులకే కట్టడి చేసి రెండో విజయం సొంతం చేసుకుంది.

ప్రపంచకప్​తో అప్పటి జట్టు సభ్యులు

కపిల్‌దేవ్‌ సంచలన ఇన్నింగ్స్‌

అనంతరం ఆసీస్‌, వెస్టిండీస్‌లతో వరుసగా ఓటమిపాలవడం వల్ల కపిల్‌ సేనకు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్‌ బెర్తు. ఒక్కమ్యాచ్‌లో ఓడిపోయినా ఇక ఇంటికిముఖం పట్టాల్సిందే. అయితే జింబాబ్వేతో జరిగిన తర్వాతి మ్యాచ్‌లో భారత్‌ 17 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక ప్రపంచకప్‌లో భారత్‌ పని అయిపోయిందని అంతా భావించారు. సరిగ్గా ఆ సమయంలో క్రీజులోకి వచ్చాడు కపిల్‌దేవ్ (175 నాటౌట్‌; 16X4, 6X6). టెయిలెండర్లతో కలిసి సంచలన బ్యాటింగ్‌ చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో భారత్‌ తరఫున తొలి శతకం సాధించడం సహా వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ ఇన్నింగ్స్‌ పూర్తయ్యేసరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో జింబాబ్వే 235 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల ఆ జట్టు ఓటమిపాలైంది. మదన్‌లాల్‌ 42 పరుగులకు మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో కపిల్‌ ప్రదర్శన అతడి జీవితంలోనే కాక భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప ఇన్నింగ్స్‌గా మారింది.

అయితే దురదృష్టవశాత్తూ ఈ మ్యాచ్‌ టీవీల్లో ప్రసారం కాలేదు. ఆ రోజు బీబీసీ ఉద్యోగులు సమ్మె చేయడం వల్ల యావత్‌ క్రీడాలోకం కపిల్‌దేవ్‌ చారిత్రక ఇన్నింగ్స్‌ను చూడలేకపోయింది.

37 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐసీసీ ట్వీట్

డిఫెండింగ్‌ ఛాంపియన్‌ను ఓడించి

ఇక తర్వాతి మ్యాచ్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన కపిల్‌సేన.. తొలిసారి ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. అక్కడ పటిష్ఠమైన ఇంగ్లాండ్‌ని ఓడించి సరాసరి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక్కడే మరో పరీక్ష ఎదురైంది. రెండుసార్లు డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా నిలిచిన వెస్టిండీస్‌తో మరోసారి తలపడాల్సి వచ్చింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కపిల్‌ జట్టు 183 పరుగులకే కుప్పకూలింది. గార్డన్‌ గ్రీనిడ్జ్‌, డెస్మండ్‌ హెయిన్స్‌, వివ్‌ రిచర్డ్స్‌, క్లైవ్‌ లాయిడ్‌ లాంటి ప్రపంచశ్రేణి బ్యాట్స్‌మెన్‌ కలిగిన వెస్టిండీస్‌ సునాయాసంగా గెలుస్తుందని అందరూ భావించారు. అయితే మ్యాచ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే గ్రీనిడ్జ్‌, డెస్మండ్‌, రిచర్డ్స్‌ త్వరగా ఔట్‌ కావడం భారత్‌కు కలిసివచ్చింది. మిగతా బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేయడం వల్ల ఆ జట్టు 140 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రపంచకప్‌లో భారత్‌ సంచలనం సృష్టించింది. రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన జట్టును ఏ మాత్రం నమ్మకం లేని భారత జట్టు ఓడించింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలో సగర్వంగా తొలిసారి కప్పును ముద్దాడింది.

ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో విశేషం.. కపిల్‌దేవ్‌ మాయ చేయడం వల్లే భారత్‌ ఈ ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచింది. మదన్‌లాల్‌ వేసిన బంతిని వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌ భారీషాట్‌ ఆడడం వల్ల బంతి గాల్లోకి లేచింది. అదే సమయంలో కపిల్‌దేవ్‌ ఏకంగా 20 మీటర్లు పరుగెత్తి కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. ఒకవేళ ఇది గనక పట్టి ఉండకపోతే రిచర్డ్స్ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేవాడు. ఏదేమైనా ఈ ప్రపంచకప్‌తో కపిల్‌దేవ్‌ హీరో కావడమే కాకుండా ఎంతోమంది ఆటగాళ్లకు స్ఫూర్తిప్రదాతగా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details