న్యూజిలాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టుపై 5-0 తేడాతో గెలిచి టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా హామిల్టన్ వేదికగా నేడు మొదటి వన్డే జరగనుంది. పొట్టి ఫార్మాట్ సిరీస్ కైవసం చేసుకున్న విశ్వాసంతో టీమిండియా బరిలో దిగుతుండగా కోహ్లీసేన జోరుకు కళ్లెం వేయాలని ఆతిథ్య కివీస్ భావిస్తోంది. గాయం కారణంగా ఇరుజట్లలోని కీలక ఆటగాళ్లు వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. కాలిపిక్క గాయంతో రోహిత్ శర్మ పర్యటనకే దూరం కాగా.. భుజం గాయంతో న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ తొలి రెండు వన్డేలకు అందుబాటులో ఉండట్లేదు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
చివరి టీ20లో గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో వన్డే సిరీస్‌కు మయాంక్ అగర్వాల్‌కు అవకాశం దక్కింది. అతడితో పాటు యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షా కూడా అవకాశం అందుకున్నాడు. ఓపెనర్‌గా రాణిస్తున్న రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని జట్టు యజమాన్యం నిర్ణయించగా.. హామిల్టన్ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేస్తున్న పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. 2016లో కూడా ఇదే తరహాలో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ జింబాబ్వేపై అరంగేట్రంలోనే ఓపెనింగ్ చేశారు. ఆస్ట్రేలియా సిరీస్‌లో రాజ్‌కోట్ వన్డేలో ఆడిన విధంగా రాహుల్ వికెట్ కీపింగ్ చేస్తూ, ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతాడని టీమిండియా సారథి కోహ్లీ తెలిపాడు. కోహ్లీ మూడు, శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలోనే ఆడనున్నారు. మనీశ్ పాండేకు అవకాశమిస్తే.. ఆల్‌రౌండర్ కోటా కోసం దూబె, జడేజా, కేదార్ జాదవ్‌ల్లో ఒకరికి అవకాశం దక్కుతుంది.