తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ నుంచి 183 సార్లు సంతకం తీసుకోవాల్సిందే..! - ధోనీ వీరాభిమాని ప్రణవ్​ జైన్​

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీకి... విపరీతమైన ఫ్యాన్​ ఫాలోయింగ్​ ఉంది. మహీతో సెల్ఫీలు దిగాలని, ఆటోగ్రాఫ్​లు తీసుకోవాలని ఎంతగానో ఎదురుచూస్తుంటారు అభిమానులు. ఈ స్టార్​ ప్లేయర్​ కూడా అంతే రీతిలో ఫ్యాన్స్ పట్ల ప్రేమను చూపిస్తుంటాడు. అయితే ఓ యువకుడు మాత్రం ఓ వినూత్నమైన లక్ష్యంతో ధోనీ వెనుక తిరుగుతున్నాడు.

die-hard MSD fan pranav jain
ధోనీ నుంచి 183 సార్లు సంతకం తీసుకోవాల్సిందే..!

By

Published : Dec 13, 2019, 6:04 AM IST

ప్రపంచకప్​ నుంచి ఐపీఎల్​ వరకు ఎన్నో విజయాలు సాధించి సక్సెస్​ఫుల్​ కెప్టెన్​గా ఘనత సాధించాడు టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ. అందుకే భారత క్రికెట్​లో మహీకి విపరీతమైన అభిమానుల మద్దతు ఉంది. తోటి ఆటగాళ్లతో సరదాగా ఉండటం, ఎంతటి క్లిష్టసమయాల్లోనైనా మైదానంలో కూల్​గా వ్యవహరించడం ధోనీ​ బలం. అందుకే యువ ఆటగాళ్లకు అతడొక స్ఫూర్తి. అభిమానులకు ఆరాధ్య దైవం.

అంతులేని తమ అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా ప్రదర్శిస్తుంటారు. కొందరు పచ్చబొట్లు పొడిపించుకొంటే, మరికొందరు పూజలు, రక్తదానం చేస్తారు. కొందరు మహీతో ఒక్కసారైనా ఫొటో, సెల్ఫీ, ఆటోగ్రాఫ్​ తీసుకోవాలని, అతడితో సరదాగా సంభాషించాలని కోరుకుంటారు. తాజాగా ఓ వీరాభిమాని మాత్రం ధోనీ నుంచి 183 సంతకాలు కావాలని తిరుగుతున్నాడు. మహీ ఎక్కడికి వెళితే అక్కడ దర్శనమిస్తున్నాడు.

ఇదే సంఖ్య ఎందుకు..?

భారత క్రికెట్‌కు '183' నంబర్​కు మధ్య బలమైన సంబంధం ఉంది. 1983 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ను ఓడించి విజేతగా నిలిచింది భారత్​. ఆ సమయంలో టీమిండియా కాపాడుకున్న లక్ష్యమింతే. మరో ప్రపంచకప్‌లో టాంటన్‌ వేదికగా సౌరవ్‌ గంగూలీ చేసిన పరుగులూ ఇవే. ఇంకా చెప్పాలంటే టీమిండియా తరఫున చాలామంది అత్యధిక స్కోరు 183. భారత్‌కు రెండు ప్రపంచకప్‌లు అందించిన మహేంద్ర సింగ్‌ ధోనీ.. వన్డేల్లో అత్యధిక స్కోరు కూడా 183.

అందుకే బెంగళూరుకు చెందిన వీరాభిమాని ప్రణవ్‌ జైన్‌ తన ఆరాధ్యుడి నుంచి '183' ఆటోగ్రాఫ్‌లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రస్తుతం ప్రణవ్‌ ఖాతాలో 153 ఆటోగ్రాఫ్​లు ఉన్నాయి. ఈసారి ఐపీఎల్​లోకనీసం10 ఆటోగ్రాఫులైనా సేకరించాలన్న ఉద్దేశంతో ఉన్నాడు.

ధోనీ నుంచి ఆటోగ్రాఫ్​ తీసుకుంటున్న ప్రణవ్​

"మహీభాయ్‌ నాకు 183 ఆటోగ్రాఫులు ఇస్తానని మాటిచ్చాడు. ఇందుకు ఒక షరతు విధించాడు. మొత్తం అన్ని సంతకాలు చేసిన తర్వాత మరొక్క ఆటోగ్రాఫ్‌ కూడా దొరకదని చెప్పాడు" అని ఆ అభిమాని తెలిపాడు.

కెప్టెన్‌ కూల్‌తో పాటు ప్రపంచమంతా తిరిగిన ప్రణవ్‌... గ్లోవ్స్‌, బ్యాట్లు, పోస్టర్లు, స్కెచ్‌లు తదితర వస్తువులపై సంతకాలు తీసుకున్నాడు. ఒకప్పుడు ఆటవిడుపుగా ఉన్న ఆటోగ్రాఫుల సేకరణ ఇప్పుడో అలవాటుగా మారిపోయిందని అంటున్నాడీ వీరాభిమాని. తన లక్ష్యం నెరవేరేందుకు మరో ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నాడు ప్రణవ్​.

ABOUT THE AUTHOR

...view details