ఐపీఎల్‌లో సరికొత్త మార్పులకు ఆమోదం తెలిపింది ఐపీఎల్ పాలకవర్గం. నేడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సమావేశమైన ఈ బృందం... పలు కీలక అంశాలపై చర్చించింది. నోబాల్ కోసం ప్రత్యేక అంపైర్‌ను తెరపైకి తీసుకువచ్చి... ఆసక్తి రేకెత్తించిన 'పవర్ ప్లేయర్' విధానాన్ని తోసిపుచ్చింది.
నోబాల్ అంపైర్...
వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచే ఈ సరికొత్త అంపైర్ దర్శనమివ్వనున్నాడు. ప్రత్యేకంగా నోబాల్స్ చూసేందుకే ఇతడు పనిచేస్తాడు. గత ఐపీఎల్‌లో జరిగిన తప్పిదాలను పరిశీలించాక ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఈ అంపైర్ ప్రత్యేక సాంకేతికత వాడుతూ నోబాల్స్ గుర్తిస్తాడు. ఇతడిని థర్డ్, ఫోర్త్ అంపైర్‌గా భావించరు.
గత ఐపీఎల్‌లో ఫ్రంట్ ఫుట్ నోబాల్స్ గమనించడంలో అంపైర్ల వైఫల్యం కారణంగా చాలా మ్యాచ్‌ల ఫలితాలు తారుమారయ్యాయి. దీనికి చెక్ పెట్టాలని బీసీసీఐ భావిస్తోంది. తొలుత జాతీయ టీ20 టోర్నీ... ముస్తాక్ అలీ (నవంబరు 9 నుంచి) ట్రోఫీలో ప్రయోగాత్మకంగా ఈ విధానం అమలు చేయనున్నారు. ఆ తర్వాత దీనికి తుది అనుమతి రానుంది.