2019 ఐపీఎల్‌లో వివాదాల్లో నిలిచారు అంపైర్ నిగెల్ లాంగ్. నోబాల్‌ను సరైన బాల్‌గా ప్రకటించి విరాట్‌తో వాగ్వాదం పెట్టుకున్న ఇతడు... ఆ కోపాన్ని తట్టుకోలేక డోర్‌ను పగులగొట్టాడు. ఇతడే ఐపీఎల్ ఫైనల్లో థర్డ్ అంపైర్‌గా వ్యవహరించి ధోనీ రనౌట్ నిర్ణయం తీసుకున్నాడు.
వివాదాస్పద అంపైర్‌పై తలా అభిమానుల ఫైర్ - niggle llong
ఐపీఎల్ 12వ సీజన్లో ఆటగాళ్లతో పాటు ఓ అంపైర్ పేరు మారుమోగిపోతోంది. అతడి నిర్ణయాలతో మ్యాచ్‌ల స్వరూపాలే మారిపోయాయి. తాజాగా ఐపీఎల్ ఫైనల్లో అతడు మూడో అంపైర్‌గా వ్యవహరించి విమర్శలు మూటగట్టుకుంటున్నాడు. అతడే నిగెల్ లాంగ్.
కొంపముంచిన రనౌట్...
ముంబయి-చెన్నై జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్. ముంబయి బౌలర్ హార్దిక్ వేసిన 13వ ఓవర్ ఉత్కంఠకు దారితీసింది. నాలుగో బంతికి వాట్సన్ సింగిల్ తీశాడు. మిడ్ వికెట్‌లో ఉన్న బౌలర్ నాన్ స్ట్రైకర్ వైపు వికెట్లకు బంతిని త్రో చేశాడు. హార్దిక్ బంతిని అందుకోలేదు. ఓవర్ త్రో వెళ్లగానే ధోని రెండో పరుగు మొదలుపెట్టాడు. డీప్ కవర్స్ నుంచి మెరుపులా పరుగెత్తుకుంటూ వచ్చిన ఇషాన్ కిషన్ నేరుగా వికెట్లను గిరాటేశాడు. తొలుత ఔటని భావించి ధోని నడక ప్రారంభించగా.. అంపైర్లు వెళ్లొద్దంటూ అతడిని ఆపారు. థర్డ్ అంపైర్ చాలా సేపటి వరకు నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఉత్కంఠ తారస్థాయికి చేరుకుంది. చివరికి ధోని ఔటయ్యాడని ప్రకటించగానే ముంబయి మ్యాచ్ గెలిచినంత సంబరాల్లో మునిగి తేలింది. అయితే రీప్లేలో ఔట్ స్పష్టంగా కనిపించకపోవడం వల్ల... ఆ సమయంలో 'బెనిఫిట్ ఆఫ్ డౌట్' కింద థర్డ్ అంపైర్ బ్యాట్స్‌మన్‌కు అనుకూలంగా వ్యహరించి ఉండాల్సిందని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.
- థర్డ్ అంపైర్ నిగెల్ లాంగ్ నిర్ణయంపై సీఎస్కే అభిమానులు మండిపడుతున్నారు. తమ ఆగ్రహాన్ని ట్విట్టర్ వేదికగా ప్రదర్శిస్తున్నారు. 'ధోనీ నిజంగా ఔటా?కాదా?’ అంటూ పలువురు ప్రశ్నించగా.. ‘మరోసారి ఐపీఎల్‌లో చెత్త నిర్ణయం..థర్డ్ అంపైర్ తన ఖాతాలో డబ్బులు పడేంత వరకూ ఎదురుచూసి.. ఆ తర్వాత ధోనీని ఔట్‌గా ప్రకటించాడు' అని మరికొందరు అభిమానులు మండిపడుతున్నారు.
- ఈ ఏడాది ఇంగ్లండ్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకూ నిగెల్ అంపైర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రతిష్ఠాత్మక టోర్నీలో ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తాడో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.