న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ప్రదర్శన చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దీనిపై మాజీలతో పాటు పలువురు క్రికెట్ పండితులు అతడికి సలహాలు ఇస్తున్నారు. అయితే కోహ్లీ ఒత్తిడిలో చేస్తున్న పొరపాట్ల వల్లే అతడు సులువుగా ఔటవుతున్నాడని కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ అన్నాడు.
"కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌లో ఒకడు. మాకు అతడి వికెట్ ఎంతో కీలకం. అందుకే విరాట్‌పై ఒత్తిడి పెరిగేలా చేశాం. లయ తప్పకుండా బంతులు వేస్తూ బౌండరీలు సాధించకుండా కట్టడి చేశాం. అంతేకాకుండా పొరపాట్లు చేసే అవకాశమిచ్చాం. మొత్తంగా అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాం. కోహ్లీ ఎంత తొందరగా పెవిలియన్‌కు చేరితే మాలో విశ్వాసం మరింత పెరుగుతుంది."
-ట్రెంట్ బౌల్ట్, కివీస్ బౌలర్
కివీస్ పిచ్‌లపై భారత బ్యాట్స్‌మెన్ అలవాటుపడాలంటే సమయం పడుతుందని అన్నాడు బౌల్ట్. ఈ టెస్టులో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడు.
"భారత్‌లో వారు ఎక్కువగా నెమ్మదిగా ఉన్న పిచ్‌లపై ఆడుతుంటారు. ఇక్కడి మైదానాలకు అలవాటు పడాలంటే సమయం పడుతుంది. భారత్‌లో బౌలింగ్ చేయాలన్నా నాకు అలానే ఉంటుంది. రెండో రోజు ఏకంగా 16 వికెట్లు నేలకూలాయి. ఇది టెస్టు క్రికెట్‌లో రికార్డో కాదో తెలియదు. కానీ బౌలర్లు ఎంతో గొప్పగా బౌలింగ్ చేశారు. మొత్తంగా మేం రెండో టెస్టులో మెరుగైన స్థితిలో నిలిచాం"
-ట్రెంట్ బౌల్ట్, కివీస్ బౌలర్
ఓవర్‌నైట్ స్కోరు 90/6తో మూడో రోజు ఆటను ఆరంభించిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 124 పరుగులకు ఆలౌటైంది. కివీస్‌కు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 242 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 235 పరుగులకు ఆలౌటైంది.