తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా సెలక్టర్ల రేసులో శివ రామకృష్ణన్​, బంగర్​!

భారత క్రికెట్​ జట్టు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల పదవీ కాలం ముగియడం వల్ల ఇటీవల జాతీయ సెలక్టర్ల పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. దరఖాస్తుల సమర్పణకు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఈ జాబితాలో శివ రామకృష్ణన్​, బంగర్ ​ప్రధానంగా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.

Laxman Sivaramakrishnan, bangar into Race after Apply for National Selectors post
టీమిండియా సెలక్టర్ల రేసులో శివ రామకృష్ణన్​, బంగర్​!

By

Published : Jan 24, 2020, 6:01 AM IST

Updated : Feb 18, 2020, 4:58 AM IST

భారత జట్టు సెలక్టర్లుగా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్, గగన్ ఖోడాల పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఫలితంగా జాతీయ సెలక్టర్ల పదవికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. అంతేకాకుండా పూర్తి స్థాయి మహిళా సెలక్షన్ కమిటీ, జూనియర్ జట్టు కమిటీలో రెండు పోస్టులకు బీసీసీఐ దరఖాస్తులు కోరింది. జనవరి 18న నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తుల సమర్పణకు ఆఖరు తేదీ నేడే కావడం వల్ల ఈ రేసులో నిలిచేది ఎవరన్నదానిపై ఆసక్తి ఏర్పడింది.

ద్విముఖ పోరేనా..?

భారత మాజీ క్రికెటర్ లక్ష్మణ్‌ శివరామకృష్ణన్‌ జాతీయ సెలక్టర్‌ పదవికి దరఖాస్తు చేశాడు. అతడితో పాటు మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ రాజేశ్‌ చౌహాన్‌, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌ అమే ఖురేషియా పోటీలో ఉన్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ధ్రువీకరించారు. టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ కూడా సెలక్టర్ల పదవులకు పోటీ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. వీరిద్దరితో పాటు జూనియర్‌ సెలక్షన్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ రంగంలోకి దిగే అవకాశం ఉంది.

సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న ఎమ్మెస్కే ప్రసాద్‌ (సౌత్‌ జోన్‌), గగన్ ఖోడా (సెంట్రల్‌ జోన్‌) పదవీకాలం ముగిసింది. వీరి స్థానాల్లో బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ కొత్తవారిని ఎంపిక చేయనుంది. ఇక మిగతా సభ్యులు శరణ్‌దీప్‌ సింగ్‌ (నార్త్‌ జోన్‌), జతిన్‌ పరాంజపె (వెస్ట్‌ జోన్‌), దేవాంగ్‌ గాంధీ (ఈస్ట్‌ జోన్‌) మరో సంవత్సరం పాటు కొనసాగుతారు.

ట్రాక్​ రికార్డులు...

బెన్సన్‌ అండ్‌ జాన్సన్‌ ప్రపంచకప్‌ గెలవడంలో శివ రామకృష్ణన్‌ది కీలకపాత్ర. అతడు 20 ఏళ్లుగా క్రికెట్‌ వ్యాఖ్యానం చేస్తున్నాడు. జాతీయ క్రికెట్‌ అకాడమీలో స్పిన్‌ సలహాదారుగా పనిచేస్తున్నాడు. ఐసీసీ క్రికెట్‌ కమిటీలోనూ భాగస్వామి. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌పైనా మంచి పట్టుంది. ఆటగాళ్ల ప్రతిభను గుర్తించగలడు. యుజువేంద్ర చాహల్‌పై దృష్టి పెట్టాలని రవిశాస్త్రి, కోహ్లీకి ఆయనే సలహా ఇచ్చాడట. టీమిండియా తరఫున అతడు 9 టెస్టులు, 16 వన్డేలు (మొత్తం 25 మ్యాచులు) ఆడాడు.

మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ బంగర్‌ 12 టెస్టులు, 15 వన్డేలు (మొత్తం 27 మ్యాచులు) ఆడాడు. వీరికన్నా ప్రసాద్‌ (33 టెస్టులు, 161 వన్డేలు) ఎక్కువగా ఆడాడు. అతడు జూనియర్‌ కమిటీ ఛైర్మన్‌గా రెండున్నర ఏళ్లు పనిచేయడం వల్ల నిబంధనల ప్రకారం సెలక్టర్‌గా ఆయనకు ఇంకా ఒకటిన్నర సంవత్సరమే అవకాశం ఉంటుంది. ఇక చౌహాన్‌ భారత్‌ తరఫున 21 టెస్టులు, 35 వన్డేలు ఆడాడు. 1990ల్లో అనిల్‌ కుంబ్లే, వెంకటపతి రాజుతో కలిసి ఆడాడు.

సెలక్షన్​ కమిటీని ఇంటర్వ్యూ చేసేందుకు ఎవరిని క్రికెట్​ సలహా కమిటీలో నియమిస్తారనేది కీలకం కానుంది. మదన్‌లాల్, గౌతం గంభీర్, సులక్షణ నాయక్‌లతో కూడిన ప్రతిపాదిత క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూలు చేస్తుందా? లేదంటే మరెవరైనా ఉన్నారా అనేదానిపై ఇప్పటికీ దాదా బృందం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.

Last Updated : Feb 18, 2020, 4:58 AM IST

ABOUT THE AUTHOR

...view details