ఇంగ్లాండ్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది న్యూజిలాండ్. వెల్లింగ్టన్ వేదికగా వెస్ట్‌పాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో కివీస్ గెలిచి సిరీస్ను 1-1 తేడాతో సమం చేసింది. అయితే మ్యాచ్లో ఇంగ్లీష్ ఆటగాడు డేవిడ్ మాలన్ అద్భుతమైన రీతిలో సిక్సర్ కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. మార్టిన్ గప్తిల్(41), జేమ్స్ నీషమ్(42) ధాటిగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించారు.
177 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ తడబడింది. 19.5 ఓవర్లలోనే 155 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మాలన్(39; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మోర్గాన్(32) రాణించినా ఇంగ్లీష్ జట్టు ఓడిపోయింది. క్రిస్ జోర్డాన్(3 వికెట్లు, 36 పరుగులు) ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసినా ఆ జట్టు ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.