ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా వరుస విజయాలకు బ్రేక్ పడింది. భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. కోహ్లీసేనను 10 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.
నాలుగో రోజు 144/4 వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. మరో నాలుగు పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. అజింక్య రహానె(29; 75 బంతుల్లో 5x4), హనుమ విహారి(15; 79 బంతుల్లో 2x4) వెనువెంటనే ఔటయ్యారు. తర్వాత రిషభ్ పంత్(25), రవిచంద్రన్ అశ్విన్(4), ఇషాంత్ శర్మ(12), మహ్మద్ షమి(2), జస్ప్రీత్ బుమ్రా (0) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫలితంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 191 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 183 పరుగుల ఆధిక్యాన్ని సాధించగా.. మరో తొమ్మిది పరుగులు చేసి ఆ జట్టు విజయం సాధించింది.
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 165 పరుగులకే ఆలౌటైంది. అనంతరం కివీస్ 348 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 183 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ లోటు భర్తీ చేసే క్రమంలో టీమిండియా ఆదివారం ఐదు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. పృథ్వీషా(14), ఛెతేశ్వర్ పుజారా(11), కోహ్లీ(19) విఫలమైనా మయాంక్ అగర్వాల్(58; 99 బంతుల్లో 7x4, 1x6) ఒక్కడే పట్టుదలగా ఆడాడు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ(5), ట్రెంట్ బౌల్ట్(4), కొలిన్ డి గ్రాండ్‌హోమ్(1) వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో కూడా నాలుగు వికెట్లు తీసిన సౌథీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.