అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. బ్యాట్‌తోనూ, గ్లవ్స్తోనూ రాణించిన ఇతడు.. ఆఖరి మ్యాచ్‌లో కెప్టెన్‌గానూ అదరగొట్టేశాడు. మరోసారి ఏ పాత్రలోనైనా ఒదిగిపోగల సత్తా సొంతమని చాటిచెప్పాడు.
ఆదివారం కివీస్ జట్టుతో జరిగిన ఐదో టీ20లో రాహుల్ 45 పరుగులతో రాణించాడు. అంతేకాకుండా సిరీస్ మొత్తంలో అత్యధిక పరుగుల చేసిన వీరుడిగా నిలిచి 'ప్లేయర్ ఆప్ ద సిరీస్' అందుకున్నాడు.
కోహ్లీనే అధిగమించిన రాహుల్..
తాజా సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ద్వైపాక్షిక అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీని అధిగమించాడు.
2016లో ఆస్ట్రేలియాతో జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో కోహ్లీ 199 పరుగులు చేయగా... దాన్ని రాహుల్ బ్రేక్ చేశాడు. ఈ సిరీస్‌లో రాహుల్ 224 పరుగులు చేశాడు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుల జాబితాలో తొలి నాలుగు స్థానాల్లో రాహుల్, కోహ్లీలే ఉండటం విశేషం. 2019లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో కోహ్లీ 183 పరుగులు చేయగా, అదే సిరీస్‌లో రాహుల్ 164 పరుగులు చేశాడు.