న్యూజిలాండ్‌లో విజయాల మోత మోగిస్తోన్న భారత జట్టు.. నేడు బే ఓవల్ మైదానంలో కివీస్‌తో ఆఖరి టీ20 ఆడనుంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 4-0 ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేన... క్లీన్‌స్వీప్ కోసం ప్రయత్నిస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు పరువు కాపాడుకునేందుకు తపిస్తోంది.
ర్యాంక్ లక్ష్యమైతే...
న్యూజిలాండ్ గడ్డపై భారత్ ఇప్పటివరకు టీ20 సిరీస్ గెలవలేదు. 2009లో ధోనీ సారథ్యంలోని జట్టు 0-2తో ఓటమి పాలైంది. గతేడాది మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-2తో చేజారింది. అయితే తాజా సిరీస్‌లో నాలుగు విజయాలు సాధించిన కోహ్లీ సేన.. ఇప్పటికే కివీస్ గడ్డపై ట్రోఫీ ఖాయం చేసుకుంది. అయితే ఐదు మ్యాచ్‌లు గెలిస్తే.. 'మెన్ ఇన్ బ్లూ' టీ20 ర్యాంకింగ్స్‌లో మరింత ముందుకెళ్తుంది. ఎప్పటినుంచో ఐదో స్థానానికే పరిమితమైన భారత్.. మెరుగైన ప్రదర్శన చేస్తే ఒక ర్యాంకు మెరుగుపడి నాలుగోస్థానానికి ఎగబాకొచ్చు.
పంత్‌కు అవకాశం...
ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఊపుమీదున్న భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో భారీ మార్పులకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు శాంసన్ ఈ మ్యాచ్‌లో రోహిత్‌తో కలిసి బరిలోకి దిగే అవకాశముంది. కేఎల్ రాహుల్ స్థానంలో పంత్ రానున్నాడు. వాషింగ్టన్ సుందర్, జడేజా, శార్దూల్, మనీశ్ పాండే తుది జట్టులో పక్కాగా ఉండనున్నారు. చాహల్ స్థానంలో కుల్దీప్, బుమ్రా బదులు షమీ జట్టులోకి రానున్నారు.