మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతోన్న టీ20 సిరీస్‌లో టీమిండియా మరో విజయం ఖాతాలో వేసుకుంది. చివరిదైన ఐదో టీ20లోనూ కివీస్‌కు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (60) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. రాహుల్ 45 పరుగులతో రాణించాడు.
అనంతరం 164 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్ తడబడుతూ ఆరంభించింది. గప్తిల్ (2), మున్రో (15), బ్రూస్(0) నిరాశపర్చగా 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అనంతరం వచ్చిన టేలర్, సీఫెర్ట్‌లు భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
శివం దూబే చెత్త రికార్డు
శివం దూబే వేసిన 10వ ఓవర్లో ఏకంగా 34 పరుగులు పిండుకున్నారు టేలర్, సీఫెర్ట్. ఈ ఓవర్లో నాలుగు సిక్సులు, రెండు పోర్లూ వచ్చాయి. ఫలితంగా టీ20ల్లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారతీయ ఆటగాడిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు దూబే.
జోరుమీదున్న సీఫెర్ట్ (50), రాస్ టేలర్ (53)ను నవదీప్ సైనీ పెవిలియన్ పంపి టీమిండియా శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత కివీస్ ఏ దశలోనూ కోలుకోలేదు. చివరి ఓవర్లో సోధి రెండు సిక్సులు కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 156 పరుగులు చేసి ఓటమిపాలైంది న్యూజిలాండ్. 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.