తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​Xకివీస్​: రోహిత్​ 'సూపర్'​​ షో.. చరిత్ర సృష్టించిన కోహ్లీసేన - భారత్​Xకివీస్​: సూపర్​ 'హిట్'​ షో.. చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

New Zealand vs India, 3rd T20I
సూపర్​ 'హిట్'​ షో... చరిత్ర సృష్టించిన భారత్​

By

Published : Jan 29, 2020, 4:22 PM IST

Updated : Feb 28, 2020, 10:09 AM IST

16:05 January 29

భారత్​Xకివీస్​: రోహిత్​ 'సూపర్'​​ షో.. చరిత్ర సృష్టించిన కోహ్లీసేన

హామిల్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మూడో టీ20 ఉత్కంఠ పోరుకు దారితీసింది. సూపర్​ ఓవర్​ రూపంలో జరిగిన ఈ మ్యాచ్​​లో భారత్​ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్​లో 18 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్​ రెండు సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. ఫలితంగా రెండు మ్యాచ్​లు ఉండగానే న్యూజిలాండ్​ గడ్డపై తొలిసారి టీ20 సిరీస్​ గెలిచింది భారత జట్టు. ప్రస్తుతం ఐదు మ్యాచ్​ల సిరీస్​లో 3-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది కోహ్లీసేన.

సూపర్​ ఓవర్ ఇలా...

సూపర్​ ఓవర్​లో తొలుత బ్యాటింగ్​కు దిగింది న్యూజిలాండ్​. భారత పేసర్​ బుమ్రా బౌలింగ్​లో... కేన్​ విలియమ్సన్​(11), గప్తిల్​(5) రన్స్​ చేశారు. వీటితో పాటు 1 పరుగు​ బైస్​ రూపంలో లభించింది. ఫలితంగా 6 బంతుల్లో 17 రన్స్​ చేసింది కివీస్​ జట్టు. బ్లాక్​ క్యాప్స్​ నిర్దేశించిన 18 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేసింది కోహ్లీసేన. బరిలోకి దిగిన రోహిత్​, కేఎల్​ రాహుల్​... కివీస్​ బౌలర్​ సౌథీ వేసిన ఆరు బంతుల్లో 2, 1, 4, 1, 6, 6  పరుగులు సాధించారు. హిట్​మ్యాన్​(15), రాహుల్​(5)తో అజేయంగా నిలిచి జట్టుకు విజయాన్నందించారు.

సారథి కేన్​ పోరాటం వృథా...

సిరీస్​ కాపాడుకోవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్​లో అద్భుత ఇన్నింగ్స్​ ఆడాడు న్యూజిలాండ్​ సారథి కేన్​ విలియమ్సన్​. ఓపెనర్లు గప్తిల్​(31),మన్రో(14) రన్స్​ చేసి ఫర్వాలేదపించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేన్​.. భారత్​ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు. భారత్​ ఇచ్చిన 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు శాయశక్తులా శ్రమించాడు. 48 బంతుల్లో 95 రన్స్​ చేసి జట్టును విజయం అంచుల వరకు తీసుకువెళ్లినా... భారత పేసర్​ షమి వేసిన 19.3 ఓవర్​ వద్ద ఔటయ్యాడు కేన్​. అప్పటికి కివీస్​ స్కోరు 175. మూడు బంతుల్లో 5 రన్స్​ కొట్టాల్సి ఉండగా 4 రన్స్​ చేసి డ్రా చేసింది బ్లాక్​ క్యాప్స్​ జట్టు. బరిలో సీఫెర్ట్​, టేలర్​ వంటి బ్యాట్స్​మన్​ ఉన్నా... 3 బంతుల్లో 5 రన్స్​ చేయలేకపోయారు. ఫలితంగా మ్యాచ్​ సూపర్​ ఓవర్​కు దారితీసింది. భారత బౌలర్లలో శార్దూల్, షమి​ రెండేసి వికెట్లు, చాహల్​, జడేజా ఒక్కో వికెట్​ సాధించారు.

రోహిత్​ మెరుపులు...

మూడో టీ20లో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టుకు మంచి లక్ష్యమే నిర్దేశించింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్‌ రోహిత్​ (65; 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (27; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్​) అతడికి తోడుగా నిలిచాడు. వీరిద్దరి జోరుతో 8 ఓవర్లకే స్కోరు 82కు చేరుకుంది.అద్భుతంగా ఆడుతున్న ఓపెనింగ్‌ జోడీని రాహుల్‌ను ఔట్‌ చేయడం ద్వారా గ్రాండ్‌హోమ్‌ విడదీశాడు. అప్పుడు స్కోరు 89. ఆ తర్వాత వచ్చిన శివమ్‌ దూబె (3) నిరాశపరిచాడు. జట్టు స్కోరు 94 వద్ద ఔటయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్‌ (17)తో కలిసి విరాట్‌ కోహ్లీ (38; 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్​) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. శాంట్నర్‌ ఊరించేలా వేసిన 16.6వ బంతికి శ్రేయస్‌ స్టంపౌట్‌ అయ్యాడు.

బౌండరీలు బాదుతూ ఊపుమీదున్న కోహ్లీ కూడా మరికాసేపటికే పెవిలియన్‌ చేరాడు.న్యూజిలాండ్‌ డెత్‌ ఓవర్లను కట్టుదిట్టంగా విసరడం వల్ల స్కోరు 180 దాటుతుందా అని సందేహం కలిగింది. ఆఖర్లో మనీశ్‌ పాండే (14; 6 బంతుల్లో 1ఫోర్​, 1 సిక్సర్​), రవీంద్ర జడేజా (10; 5 బంతుల్లో 1 సిక్సర్​) మెరవడం వల్ల స్కోరు 179కి చేరుకుంది. కివీస్‌లో హమిష్‌ బెన్నెట్‌ 3 వికెట్లు తీశాడు. శాంట్నర్‌, గ్రాండ్‌హోమ్‌కు చెరో వికెట్‌ దక్కింది.

Last Updated : Feb 28, 2020, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details