తెలంగాణ

telangana

ETV Bharat / sports

రెండో ఇన్నింగ్స్​లో భారత్​ ఢమాల్​​... ప్రస్తుతం 90/6 - New Zealand vs India virat kohli

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 90 పరుగులకే 6 కీలక వికెట్లు కోల్పోయింది. పుజారా(24) టాప్​ స్కోరర్​గా నిలిచాడు​. రెండో రోజు ఆటముగిసే సమయానికి విహారి(5), పంత్​(1) అజేయంగా ఉన్నారు. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది.

New Zealand vs India, 2nd Test
రెండో ఇన్నింగ్స్​లో కుప్పకూలిన టాప్​ ఆర్డర్​... భారత్​ 90/6

By

Published : Mar 1, 2020, 11:53 AM IST

Updated : Mar 3, 2020, 1:19 AM IST

క్రైస్ట్​చర్చ్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో భారత్​ టాప్​ ఆర్డర్​ కుప్పకూలింది. కేవలం 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. రెండో రోజు ఆటముగిసే సమయానికి క్రీజులో విహారి(5), పంత్​(1) నాటౌట్​గా నిలిచారు. ప్రస్తుతం 97 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది టీమిండియా. కోహ్లీ సేన ఇదే ప్రదర్శన కొనసాగిస్తే.. ఈ టెస్టు మూడురోజుల్లోనే ముగిసే అవకాశముంది!

భారత బ్యాట్స్​మెన్​​ 'క్యూ' కట్టేశారు..

రెండో ఇన్నింగ్స్​ ఆరంభంలోనే భారత్​కు ఎదురుదెబ్బ తగిలింది. సిరీస్​లో పెద్దగా రాణించని మయాంక్​(3) మళ్లీ నిరాశపర్చాడు. ఆ తర్వాత పృథ్వీ షా(14), కోహ్లీ(14), పుజారా(24), రహానె(9), ఉమేశ్​(1) పేలవ ప్రదర్శన చేశారు. న్యూజిలాండ్​ బౌలర్లలో బౌల్ట్​ 3 వికెట్లు తీయగా.. సౌథీ, వాగ్నర్, గ్రాండ్​హోమ్​ తలో వికెట్​ ఖాతాలో వేసుకున్నారు.

కివీస్​ను కట్టడి చేసిన షమి, బుమ్రా

రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌటైంది. జేమిసన్‌ 49 (63 బంతుల్లో; 7 ఫోర్లు) మరోసారి చెలరేగడం వల్ల ఆ జట్టు మంచి స్కోరు సాధించింది. మహ్మద్‌ షమి(4), జస్ప్రీత్‌ బుమ్రా(3), రవీంద్ర జడేజా(2), ఉమేశ్‌ యాదవ్‌(1) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

63/0 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆదివారం రెండో రోజు బ్యాటింగ్‌ కొనసాగించిన కివీస్‌ ఆదిలోనే బ్లండెల్‌(30) వికెట్ కోల్పోయింది‌. ఉమేశ్‌ యాదవ్‌ ఎల్బీ చేయడం వల్ల అతడు ఔటయ్యాడు. మరో మూడు పరుగులకే కెప్టెన్‌ విలియమ్సన్‌(3) బుమ్రా బౌలింగ్‌లో కీపర్‌ చేతికి చిక్కాడు. ఫలితంగా కివీస్‌ 69 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది.

అనంతరం రాస్‌టేలర్‌(15), టామ్‌ లాథమ్‌ 52 (122 బంతుల్లో 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో టేలర్‌ ఉమేశ్‌ యాదవ్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. కాసేపటికే లాథమ్‌ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాక షమి బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. తర్వాత హెన్రీ నికోల్స్‌(14)ను షమి బోల్తా కొట్టించాడు. భోజన విరామానికి న్యూజిలాండ్‌ 48 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

ఆట ప్రారంభమైన మూడో ఓవర్లో బుమ్రా మాయ చేశాడు. వాట్లింగ్‌(0), సౌథీ(0)లను పెవిలియన్‌ పంపాడు. కాసేపటికే గ్రాండ్‌హోమ్‌(26)ను జడేజా బౌల్డ్‌ చేయడం వల్ల కివీస్‌ 177 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఇక న్యూజిలాండ్‌ 200లోపు ఆలౌటైతుందని భావించాక.. జేమిసన్‌ 49 (63 బంతుల్లో 7 ఫోర్లు), నీల్‌ వాగ్నర్‌ 21(41 బంతుల్లో 3ఫోర్లు).. 51 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

ఈ క్రమంలో షమి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన వాగ్నర్‌.. జడ్డూ పట్టిన అత్యద్భుత క్యాచ్‌కు వెనుతిరిగాడు. మరో ఏడు పరుగుల తర్వాత షమి బౌలింగ్‌లోనే జేమిసన్‌ పంత్‌కు చిక్కడం వల్ల కివీస్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఫలితంగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 పరుగుల ఆధిక్యం సాధించింది.

Last Updated : Mar 3, 2020, 1:19 AM IST

ABOUT THE AUTHOR

...view details