ఇంగ్లాండ్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్‌ను ఇంకా మర్చిపోకముందే మరోసారి అలాంటి పోరు జరిగింది. మెగాటోర్నీ తర్వాత ఇరుజట్ల మధ్య జరిగిన తొలి టీ20 సిరీస్‌లోనూ అదే ఫలితం పునరావృతమైంది. న్యూజిలాండ్ గడ్డపై జరిగిన ఈ పొట్టి సిరీస్‌లో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. ఐదు టీ20ల సిరీస్‌ను 3-2 తేడాతో ఎగరేసుకుపోయింది. కీలకమైన ఆఖరి మ్యాచ్ డ్రాగా ముగియడం వల్ల సూపర్ ఓవర్‌తో ఫలితం తేలింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ బెయిర్ స్టో (ఇంగ్లాండ్), మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా సాంటర్న్(కివీస్) నిలిచారు.
ఆక్లాండ్ వేదికగా ఆదివారం జరిగిన చివరి టీ20లో వర్షం కారణంగా మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఐదు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. గప్తిల్(50), మున్రో(46), టిమ్ సీఫర్ట్(39) రాణించారు.
లక్ష్య ఛేదనలో 11 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసిన ఇంగ్లాండ్.. మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. ఆఖరి బంతికి ఐదు పరుగులు చేయాల్సి ఉండగా ఫోర్ కొట్టాడు క్రిస్ జోర్డాన్. ఇంగ్లీష్ ఆటగాళ్లలో బెయిర్‌స్టో (47), సామ్ కరన్(24) ఆకట్టుకున్నారు.
సూపర్ ఓవర్ ఇలా...
మ్యాచ్ డ్రా కావడం వల్ల సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్‌స్టో, మోర్గాన్.. సౌథీ బౌలింగ్‌లో 1, 6, 1, 6,1, 2 కలిపి మొత్తం 17 పరుగులు చేశారు.
కివీస్ లక్ష్యం 18 పరుగులు. గప్తిల్, సీఫర్ట్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి బంతికి రెండు పరుగులు రాగా తర్వాత బంతి వైడ్‌గా వెళ్లింది. తర్వాత రెండు బంతుల్లో 4 పరుగులే వచ్చాయి. అనంతరం నాలుగో బంతికి సీఫర్ట్ ఔటయ్యాడు. రెండు బంతుల్లో ఇంకా 11 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం ఒక్క పరుగు మాత్రమే లభించింది. ఫలితంగా ఇంగ్లీష్ జట్టు గెలిచింది.
ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో చివరి బంతికి ఫోర్ కొట్టి మ్యాచ్ డ్రా చేసిన ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డాన్.. సూపర్ ఓవర్లో బౌలింగ్ ద్వారా 8 పరుగులే ఇచ్చి కివీస్ విజయాన్ని అడ్డుకున్నాడు.
ప్రపంచకప్‌లోనూ ఇలానే...
ప్రపంచకప్ ఫైనల్లో తలపడిన కివీస్, ఇంగ్లాండ్ జట్లు.. స్కోర్లు సమం కావడం వల్ల సూపర్ ఓవర్ ఆడాయి. అందులో ఇంగ్లాండ్ 16 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ అంతే స్కోరు సాధించి మళ్లీ మ్యాచ్‌ను డ్రా చేసింది. అయితే ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. తాజాగా ఇదే ఫలితం పునరావృతమైంది.