తెలంగాణ

telangana

By

Published : Jul 30, 2020, 7:29 AM IST

ETV Bharat / sports

కొత్త దారిలో క్రికెట్ గెలిచి నిలిచెలే!

కరోనా కారణంగా నాలుగు నెలలుగా క్రికెట్ టోర్నీలు వాయిదా పడ్డాయి. మ్యాచ్​లు లేక నిరాశలో కూరుకుపోయిన అభిమానులకు ఇంగ్లాండ్-వెస్టిండీస్ సిరీస్ కాస్త ఊరటనిచ్చింది. అయితే ఈ సిరీస్ నిర్వహించడం వెనక ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు శ్రమ చాలా ఉంది. ఇప్పుడు ఈ ట్రోఫీ విజయవంతం కావడం వల్ల మిగిలిన దేశాలు మ్యాచ్​ల నిర్వహణకు ముందుకొస్తున్నాయి. అందరి దృష్టి త్వరలో జరగనున్న ఐపీఎల్​పైనే నెలకొని ఉంది.

కొత్త దారిలో క్రికెట్ గెలిచి నిలిచెలే!
కొత్త దారిలో క్రికెట్ గెలిచి నిలిచెలే!

అసలు ఈ ఏడాది క్రికెట్‌ జరిగేనా? మైదానంలో తిరిగి ఆటగాళ్లను చూడగలమా? కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో ఇలా ఎన్నో అనుమానాలు అభిమానులను వేధించాయి. బాధించాయి. కానీ నిరాశకు చెక్‌ పెడుతూ మహమ్మారిపై క్రికెట్‌ గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఊపిరిలూదుతూ వెస్టిండీస్‌తో సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు.. భవిష్యత్తు ఆటకు బాటలు పరిచింది. ప్రయోగాత్మకంగా బయో సెక్యూర్‌ బబుల్‌ (బుడగ)ను సృష్టించి.. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మ్యాచ్‌లు ముగించి.. సిరీస్‌ల నిర్వహణకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. క్రికెట్‌ ప్రేమికులకు చాలా కాలం తర్వాత సంతోషాన్నిచ్చింది. ఈ సిరీస్‌ ఇచ్చిన విశ్వాసంతో రాబోయే రోజుల్లో మరిన్ని జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

ఆ శ్రమ ఫలితమే

బయో సెక్యూర్‌ వాతావరణంలో మ్యాచ్‌ల నిర్వహణ వెనక ఇంగ్లాండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) శ్రమ ఎంతో దాగి ఉంది. తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ బుడగ విధానంలో టెస్టులు నిర్వహిస్తామని వెస్టిండీస్‌ను ఒప్పించడం దగ్గర నుంచి చివరి టెస్టు ముగిసేంతవరకూ తెరవెనకాల ఓ చిన్నపాటి యుద్ధమే చేసింది ఈసీబీ. జూన్‌ 9న ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందితో కూడిన విండీస్‌ బృందం ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టింది. వాళ్లకు వైరస్‌ నిర్ధరణ పరీక్షలు చేయడం నుంచి మొదలు ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలోని పరిసరాల్లో ఉన్న హోటల్లో వాళ్లను క్వారంటైన్‌లో పెట్టడం, పర్యవేక్షణ కొనసాగించడం.. ఇదే ఈసీబీ పని. మరోవైపు సౌథాంప్టన్‌లో ఉన్న తమ ఆటగాళ్ల విషయంలోనూ ఇదే పద్ధతి అనుసరించింది.

కొత్త దారిలో క్రికెట్ గెలిచి నిలిచెలే!

గత నెల 23 వరకూ ఆటగాళ్లతో పాటు మ్యాచ్‌ నిర్వహణలో సంబంధం ఉన్న అందరికీ కలిపి 702 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. 25 నుంచి వారంలో రెండుసార్లు ఆటగాళ్లను పరీక్షించారు. వాళ్ల చుట్టూ ఏర్పాటు చేసిన బుడగను గ్రీన్‌, ఆరెంజ్‌, రెడ్‌ జోన్లుగా విభజించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాని ఫలితమే ఇప్పుడు సిరీస్‌ విజయం రూపంలో దక్కింది. 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకున్న ఈసీబీకి ఆ గెలుపు కంటే కూడా.. ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించడమే ఎక్కువ సంతృప్తిని ఇచ్చి ఉంటుంది. అదే జోరులో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు, ఆ తర్వాత పాక్‌తో టెస్టులకు ఇంగ్లాండ్‌ సిద్ధమైపోయింది. బీసీసీఐ కూడా ఐపీఎల్‌ సీజన్‌ నిర్వహించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

మరి ఐపీఎల్‌..

ఐపీఎల్‌ పదమూడో సీజన్‌ను యూఏఈలో నిర్వహించే దిశగా బీసీసీఐ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి రావడమే మిగిలింది. ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ సిరీస్‌ విజయవంతం కావడం కూడా ఐపీఎల్‌ లీగ్‌ నిర్వహణపై బీసీసీఐకి మరింత నమ్మకాన్ని ఇచ్చింది. అయితే ఆ లీగ్‌ నిర్వహణ అనుకున్నంత సులభం కాకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో 16 జట్లను ఒక్కచోటుకు చేర్చి మ్యాచ్‌లు జరపలేక టీ20 ప్రపంచకప్‌ నిర్వహణ తమ వల్ల కాదని క్రికెట్‌ ఆస్ట్రేలియా చేతులెత్తేయడం వల్ల ఐసీసీకి దాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయక తప్పలేదు. ప్రపంచకప్‌ వాయిదాతో మార్గం సుగమం చేసుకున్న ఐపీఎల్‌ పరిస్థితి కూడా ఇంచుమించు అలాంటిదే. 16 కాకున్నా ఎనిమిది జట్లతో లీగ్‌ నిర్వహించడమూ కఠిన సవాలే.

ఇంగ్లాండ్‌, విండీస్‌ అంటే రెండే జట్లు కాబట్టి బుడగను సృష్టించడం సులభమైంది. కానీ ఐపీఎల్‌ కోసం అలాంటి పరిస్థితులు నెలకొల్పాలంటే దాదాపు దానికి నాలుగింతలు కష్టపడాల్సిందే. స్వదేశీ, విదేశీ ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, ప్రతినిధులు కలిపి సుమారు 800 మంది యూఏఈకి వెళ్లాల్సి ఉంది. జట్లను స్టేడియాలకు దగ్గర్లో ఉంచడం వీలవుతుందా? ఒకవేళ ఉంచినా ఆటగాళ్లను, సిబ్బందిని, మ్యాచ్‌ నిర్వహణతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ ఒక్క చోటులో ఉంచి బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణాన్ని ఏర్పాటు చేయడం అయ్యే పనేనా? వాళ్లకు తరచుగా వైరస్‌ నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం, క్వారంటైన్‌లో ఉంచడం సాధ్యమేనా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఏదైనా తేడా జరిగితే మాత్రం ప్రపంచ క్రికెట్‌ మొత్తం బీసీసీఐ వైపే వేలెత్తి చూపడం ఖాయం.

ABOUT THE AUTHOR

...view details