భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపటి(మంగళవారం) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుంది. వాంఖడే వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. ఆదివారం రాత్రి బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు టీమిండియా క్రికెటర్లు. ఇందులో భాగంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, భారత ఆటగాళ్లు, ప్రధాన కోచ్ రవిశాస్త్రి సహా బ్యాటింగ్, బౌలింగ్ కోచ్‌లు, సహాయ సిబ్బంది హాజరయ్యారు. వేడుక తర్వాత అంతా కలిసి ఫొటో దిగారు. దీనిని ట్విట్టర్ వేదికగా పంచుకుంది బీసీసీఐ. అయితే ఇందులో కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
బీసీసీఐపై ఛలోక్తులు
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఈ ఫొటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా.. కోహ్లీ ఏమయ్యాడు..? అని అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కొందరు కోహ్లీ మీమ్స్‌తో ఎడిటింగ్ చేస్తుండగా.. మరికొందరు సరదాగా జోకులేస్తున్నారు. అతడు ఈ ఫొటోలోఎందుకు లేడనేది చర్చనీయాంశంగా మారింది.
పంత్ కూడా ఇందులో మిస్సయ్యాడు. కోహ్లీ జిమ్‌కు వెళ్లాడని కొందరు, ఫొటో తీసింది అతడే అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. పంత్, కోహ్లీ పార్టీలో ఉన్నారని కొందరు ఛలోక్తులు విసురుతున్నారు.