అంతర్జాతీయ క్రికెట్ మండలి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆస్ట్రేలియాలో నిర్వహించిన మహిళల టీ20 ప్రపంచకప్‌నకు విశేష స్పందన రావడం వల్ల దాన్ని డిజిటల్ మాధ్యమంలో.. డాక్యుమెంటరీ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. నేటి నుంచి ప్రముఖ డిజిటల్ ప్రసార మాధ్యమం నెట్‌ఫ్లిక్స్‌లో దాన్ని వీక్షించొచ్చని నెటిజన్లకు చెప్పింది. మహిళా క్రికెటర్ల ఆటతో పాటు వారి భావోద్వేగాలు, ప్రేక్షకుల కేరింతలను చూడొచ్చని ఐసీసీ పేర్కొంది.
క్రీడా చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా తొలిసారి మహిళల ఆటకు పెద్ద ఎత్తున స్పందన లభించింది. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో ప్రత్యక్షంగా చూడటమే కాకుండా వివిధ మాధ్యమాల్లోనూ భారీగా చూశారు.
టోర్నీలో మొత్తం పది జట్లు పాల్గొనగా భారత్-ఆస్ట్రేలియా తుదిపోరుకు చేరాయి. ఈసారైనా టీమ్‌ఇండియా కప్పు గెలుస్తుందని ఆశించినా హర్మన్‌ప్రీత్ కౌర్ జట్టు ఓటమిపాలైంది. అయితే, అమ్మాయిల ప్రతిభకు విశేషమైన గౌరవం లభించింది. ముఖ్యంగా టీనేజ్ క్రికెటర్ షెఫాలీ వర్మ తన బ్యాటింగ్‌తో మంచి గుర్తింపు దక్కించుకుంది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 85 పరుగులతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా 86,174 మంది మైదానంలో చూడగా టీవీ, డిజిటల్ మాధ్యమాల్లో ఆ సంఖ్య లక్షల్లో నమోదైంది. దీంతో అది మహిళల క్రికెట్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రీడల్లో విశేషమైన స్థానం సంపాదించుకుంది.
ట్రైలర్ విడుదల...
ఈ నేపథ్యంలోనే ఆ మెగా టోర్నీని నెటిజన్లకు మరింత చేరువ చేసేందుకు ఐసీసీ నెట్‌ఫ్లిక్స్‌తో అనుసంధానమైంది. 'బియాండ్ ది బౌండరీ' పేరిట గురువారం ఆ డాక్యుమెంటరీ ట్రైలర్‌ను విడుదల చేసింది. శుక్రవారం నుంచి పూర్తి డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో ఉంటుందని వెల్లడించింది. ఈ విషయంపై స్పందించిన ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మను సావ్నే నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి దీర్ఘకాలం ప్రయాణం చేస్తామని చెప్పారు. అందుకు సంతోషంగా ఉందని, ఈ టీ20 ప్రపంచకప్ కేవలం క్రికెట్‌లోనే కాకుండా అన్ని మహిళల క్రీడల్లోనూ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిందని పేర్కొన్నారు.