తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రాకు ద్రవిడ్‌ షాక్‌.. ఫిట్‌నెస్‌ పరీక్షకు తిరస్కారం - Bumrah Fitness Test

సున్నితమైన మాట.. వివాదాలకు దూరం.. రాహుల్‌ ద్రవిడ్‌ తీరిది! అయితే ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) బాధ్యతలు చూస్తున్న ఈ దిగ్గజ ఆటగాడు.. ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం అక్కడికి వచ్చిన టీమ్‌ఇండియా ప్రధాన ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాను తిప్పి పంపడం ద్వారా వార్తల్లో నిలిచాడు. రాహుల్‌ ఇంత కఠినంగా వ్యవహరించడానికి కారణమేంటన్నది భారత క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

NCA Refuses to bumrah to make a fitness test
బుమ్రాకు ద్రవిడ్‌ షాక్‌.. ఫిట్‌నెస్‌ పరీక్షకు తిరస్కారం

By

Published : Dec 21, 2019, 7:38 AM IST

జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)..! గాయాల పాలైన టీమ్‌ఇండియా ఆటగాళ్లు కోలుకోవాలన్నా.. సిరీస్‌ల మధ్య విరామంలో సాధన చేయాలన్నా.. యువ ఆటగాళ్లు శిక్షణ పొందాలన్నా.. ఇదే కేంద్రం. భారత క్రికెట్‌కు సంబంధించి ఇది అత్యంత కీలకమైన వేదిక ఇది. భారత క్రికెటర్లకు సిరీస్‌ ముంగిట ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహించేది కూడా ఇక్కడే. అయితే గాయం కారణంగా కొన్ని నెలలుగా ఆటకు దూరంగా ఉన్న టీమ్‌ఇండియా ఫాస్ట్‌బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా, ఇటీవలే కోలుకుని ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం ఎన్‌సీఏకు వెళ్తే.. అతడిని అకాడమీ అధినేత రాహుల్‌ ద్రవిడ్‌ వెనక్కి పంపడం చర్చనీయాంశమైంది. గాయం నుంచి కోలుకోవడం కోసం అతను ఎన్‌సీఏకు రాకపోవడంతో ద్రవిడ్‌ ఆగ్రహించి అతడికి ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.

బుమ్రా ఎన్​సీఏకు రాకపోవడమే సమస్య

ఇండియా-ఎ, అండర్‌-19 జట్ల కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌.. కొన్ని నెలల కిందటే ఎన్‌సీఏ చీఫ్‌గా అదనపు బాధ్యతలు అందుకున్న సంగతి తెలిసిందే. సాధారణంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లు గాయాల నుంచి కోలుకోవడానికి వేదికగా ఎన్‌సీఏనే ఎంచుకుంటారు. ఇక్కడి ఫిజియోల పర్యవేక్షణలోనే ఉంటూ ఫిట్‌నెస్‌ సాధించే ప్రయత్నం చేస్తారు. తర్వాత ఫిట్‌నెస్‌ పరీక్షకు హాజరవుతారు. అయితే గాయపడ్డాక బుమ్రా.. ఏ దశలోనూ ఎన్‌సీఏకు రావడానికి ఇష్టపడలేదని తెలుస్తోంది. విదేశాలకు వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్న అతను.. అనంతరం వ్యక్తిగత ట్రైనర్‌ సాయంతో కోలుకునే ప్రయత్నం చేశాడు. ముంబయిలో ఉంటూ సాధన సాగించాడు. ఇటీవలే విశాఖపట్నంలో వన్డే సందర్భంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లతో కలిసి నెట్స్‌లో పాల్గొన్నాడు కూడా. అక్కడి నుంచి ఫిట్‌నెస్‌ పరీక్ష కోసం బెంగళూరులోని ఎన్‌సీఏకు వెళ్లగా.. తాము అతడికి ఆ పరీక్ష నిర్వహించలేమని ద్రవిడ్‌ బృందం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. విదేశాల్లో శస్త్రచికిత్స చేయించుకుని, వ్యక్తిగత ట్రైనర్‌ సాయంతో కోలుకునే ప్రయత్నం చేసిన బుమ్రా.. ఏమేరకు ఫిట్‌ అయ్యాడో తామెలా అంచనా వేస్తామని ద్రవిడ్‌ అన్నట్లు సమాచారం. గాయపడ్డాక ఎన్‌సీఏకు రావడానికి బుమ్రా విముఖత చూపడాన్ని దృష్టిలో ఉంచుకునే అతను ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

బుమ్రా ఒక్కడే కాదు..

ఇంతకుముందులా టీమ్‌ఇండియా ఆటగాళ్లు గాయపడ్డాక కోలుకోవడానికి ఎన్‌సీఏకు రావడానికి అంతగా ఇష్టపడట్లేదన్నది జట్టు వర్గాల సమాచారం. బుమ్రా లాగే కొన్ని నెలల కిందట గాయపడ్డ హార్దిక్‌ పాండ్య సైతం ఎన్‌సీఏకు వెళ్లలేదు. అతను కూడా విదేశాల్లో శస్త్రచికిత్స అనంతరం ముంబయిలో ఉంటూ కోలుకునే ప్రయత్నం చేశాడు. ఎన్‌సీఏలో ఫిజియో, ట్రైనర్ల పనితీరు సంతృప్తికరంగా లేకపోవడం దీనికి ముఖ్య కారణంగా తెలుస్తోంది. అక్కడ నిర్వహించే వైద్య పరీక్షల మీదా సందేహాలున్నాయి.

ఎన్​సీఏపై భువి, సాహా అసంతృప్తి..

భువనేశ్వర్‌ వ్యవహారమే ఇందుకు రుజువు. అతను కూడా కొన్ని నెలల కిందట గాయపడ్డాడు. తర్వాత ఎన్‌సీఏ గూటికే చేరాడు. పూర్తిగా కోలుకున్నాడనుకున్నాక అతడిని తిరిగి టీమ్‌ఇండియాకు ఎంపిక చేశారు. కానీ ఇటీవల మళ్లీ అతడికి గాయమని తేలింది. ఎన్‌సీఏలో ఉండగా భువికి చేసిన స్కానింగ్‌ పరీక్షల్లో ఎక్కడా గాయం ఉన్నట్లు కనిపించలేదు. కానీ తాజాగా విండీస్‌తో టీ20 సిరీస్‌ ఆద్యంతం అతను ఇబ్బంది పడ్డాడు. ముంబయిలో చివరి టీ20 సందర్భంగా స్కానింగ్‌ తీస్తే గాయం ఉన్నట్లు తేలింది. దీంతో ఎన్‌సీఏ ప్రమాణాలపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంతకుముందు సాహా విషయంలోనూ ఇలాగే జరిగింది. అక్కడ గాయాల్ని మాన్పే ప్రక్రియ పట్ల భువి, సాహా లాంటి వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో మిగతా ఆటగాళ్లలోనూ వ్యతిరేక భావం ఏర్పడిందని.. ఈ క్రమంలోనే బుమ్రా, హార్దిక్‌ అక్కడికి వెళ్లలేదని.. అయితే ఎన్‌సీఏపై ఇంకా పూర్తి పట్టు సాధించని ద్రవిడ్‌ అసలు విషయం తెలియక బుమ్రాకు ఇలా షాకిచ్చాడని భారత క్రికెట్‌ వర్గాలంటున్నాయి.

ద్రవిడ్‌తో మాట్లాడతా: గంగూలీ

బుమ్రా-ద్రవిడ్‌ వివాదంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ స్పందించాడు. ఈ విషయమై ద్రవిడ్‌తో మాట్లాడతానని అన్నాడు. టీమ్‌ఇండియా ఆటగాళ్లందరికీ ఎన్‌సీఏలోనే ఫిట్‌నెస్‌ పరీక్ష నిర్వహించాల్సి ఉంటుందని అతను స్పష్టం చేశాడు. ‘‘భారత్‌ క్రికెట్‌కు సంబంధించి ప్రతి అంతర్జాతీయ ఆటగాడి కెరీర్లోనూ ఎన్‌సీఏ భూమిక కీలకం. ఎన్‌సీఏ ద్వారానే అన్ని ప్రక్రియలూ జరగాలి. ఆటగాళ్లకు సమస్య వచ్చినపుడు అక్కడికే వెళ్లాలి. నేను బాధ్యతలు చేపట్టి రెండు నెలలే అయింది. ఈ విషయమై ద్రవిడ్‌తో మాట్లాడతా. సమస్య ఏంటో అర్థం చేసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఎన్‌సీఏలో ఆటగాళ్లు ఇబ్బంది పడకుండా, సౌకర్యవంతమైన పరిస్థితులుండేలా చూస్తాం. కుదిరితే ఎన్‌సీఏ ఫిజియోలో వేరే చోట్లకు వెళ్లి ఆటగాళ్లకు సాయం చేసే అవకాశాన్ని కూడా పరిశీలిస్తాం’’ అని గంగూలీ అన్నాడు.

సెలక్టర్ల నియామకం కోసం కొత్త సీఏసీ

ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోనే భారత క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ కథ ముగిసింది. నాలుగేళ్లుగా బాధ్యతల్లో కొనసాగుతున్న ప్రసాద్‌ బృందానికి ఈసారి కొనసాగింపు ఉండదని బీసీసీఐ నూతన అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వారిని సాగనంపబోతున్నట్లు సౌరభ్‌ మరో సంకేతం ఇచ్చాడు. కొత్త సెలక్టర్ల నియామకం కోసం రెండు రోజుల్లో కొత్తగా క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ)ని నియమించనున్నట్లు గంగూలీ వెల్లడించాడు. కొన్నేళ్ల కిందట సౌరభ్‌, సచిన్‌, లక్ష్మణ్‌లతో కూడిన సీఏసీ కోచ్‌ల నియామకం చేపట్టింది. ఈ మధ్యే కపిల్‌దేవ్‌ నేతృత్వంలో కొత్తగా సీఏసీ ఏర్పాటు చేయగా.. అది మళ్లీ కోచ్‌ల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. తర్వాత సభ్యులందరూ కమిటీకి రాజీనామా చేశారు. ఇప్పుడు ఏర్పాటు కాబోయే కమిటీ బాధ్యత సెలక్టర్ల నియామక ప్రక్రియ వరకే పరిమితమని గంగూలీ స్పష్టం చేశాడు.

ఇదీ చదవండి: ఆ బాధతోనే నా కెరీర్​ ముగిసిందనుకున్నా: సచిన్​

ABOUT THE AUTHOR

...view details