కోహ్లీసేన విండీస్ పర్యటన ఆగస్టు 3న ప్రారంభంకానుంది. మొదటగా మూడు టీ20లు జరగనున్నాయి. ఇందులో రెండు టీ20లు ఆగస్టు 3, 4న అమెరికాలోని ఫ్లోరిడాలో జరుగుతాయి. ఈ రెండు మ్యాచ్‌లకు మాత్రమే జట్టును ప్రకటించింది విండీస్ క్రికెట్ బోర్డు. మూడో మ్యాచ్‌కు మార్పులుంటాయని తెలిపింది.
టీ20లకు బ్రాత్‌వైట్ సారథ్యం వహించనున్నాడు. ఇతడితో పాటు మొత్తం 14 మందితో కూడిన జట్టును ప్రకటించారు సెలక్టర్లు. సీనియర్ ప్లేయర్లు పొలార్డ్, సునీల్ నరేన్‌లకు స్థానం లభించింది. ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచ్ ఆడని ఆంథోనీ బ్రాంబ్లేకు చోటు దక్కింది.
ప్రపంచకప్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ రసెల్‌కు టీ20 జట్టులో అవకాశం లభించింది. గాయానికి చికిత్స తీసుకున్న రసెల్ ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాడు. విధ్వంసకర ఓపెనర్ గేల్ ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదు. కెనడాలో జరిగే గ్లోబల్ టీ20లో పాల్గొనేందుకు ముందే అంగీకారం తెలపడమే కారణం. ఇతడి స్థానంలో జాన్ క్యాంప్‌బెల్‌కు స్థానం దక్కింది.