రంజీ సమరానికి వేళైంది... దేశవాళీ పోటీల్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ టోర్నీ సోమవారం ఆరంభమైంది. అయితే నేడు విజయవాడలోని డా. గోకరాజు గంగరాజు ఏసీఏ క్రికెట్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ విదర్భ, ఆంధ్ర జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ పిలవని వ్యక్తి అతిథిగా వచ్చాడు. అతడే నాగరాజు అలియాస్ స్నేక్రాజా. ఇతడి రాకతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఆటగాళ్లు కాసేపు అతడితో ముచ్చటించి తర్వాత నెమ్మదిగా ఇంటికి వెళ్లిపోయాడు.
గుజరాత్‌తో హైదరాబాద్...
మరో మ్యాచ్‌లో ఉప్పల్ వేదికగా గుజరాత్‌తో హైదరాబాద్ తన పోరాటం ప్రారంభించింది. గతేడాది గ్రూప్-ఏలో ఆంధ్ర ఆరో స్థానం, హైదరాబాద్ 7వ స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఈసారి మెరుగైన ప్రదర్శనతో సత్తాచాటాలని రెండు జట్లు భావిస్తున్నాయి. హైదరాబాద్ కెప్టెన్ తన్మయ్ అగర్వాల్, పేసర్ మహ్మద్ సిరాజ్.. ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి, శ్రీకర్ భరత్‌లపై సెలక్టర్లు దృష్టిసారించనున్నారు.
న్యూజిలాండ్ సిరీస్‌కు ఇదే అవకాశం...
భారత టెస్టు స్పెషలిస్టులు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లు ఈ టోర్నీ బరిలో ఉన్నారు. డోపింగ్‌లో పట్టుబడి 8 నెలల నిషేధానికి గురైన యువ ఓపెనర్ పృథ్వీషా పునరాగమనం తర్వాత ఆడుతున్న పెద్ద టోర్నీ ఇదే. గతేడాది టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా దిగి మళ్లీ టైటిల్ గెలిచిన విదర్భ.. ఈసారి హ్యాట్రిక్ కొట్టాలని ఊవిళ్లూరుతోంది. రికార్డు స్థాయిలో 38 జట్లు ఈసారి టోర్నీ బరిలో ఉన్నాయి. వీటిలో ఈ ఏడాదే అరంగేట్రం చేస్తున్న చండీగఢ్ కూడా ఉంది. రాబోయే న్యూజిలాండ్ సిరీస్‌కు భారత జట్టుకు ఎంపిక కావాలని భావిస్తున్న ఆటగాళ్లకు ఈ రంజీ ట్రోఫీ మంచి వేదిక.