బంగ్లాదేశ్ పర్యటనలో అఫ్గానిస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టును టెస్టులో ఓడించిన అఫ్గాన్..టీ-20 పోరులోనూ గెలిచింది. ముక్కోణపు టీ-20 సిరీస్లో భాగంగా ఆదివారం బంగ్లాతో జరిగిన మూడో మ్యాచ్లో 25 పరుగుల తేడాతో నెగ్గింది. 84 పరుగులతో విజృంభించిన అఫ్గాన్ బ్యాట్స్మన్ మహ్మద్ నబీకి 'మ్యాన్ ఆఫ ద మ్యాచ్' అవార్డు దక్కింది.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. నబీతో పాటు అస్గార్ అఫ్గాన్(40) రాణించాడు. బంగ్లా బౌలర్లలో మహ్మద్ సైఫుద్దీన్ 4 వికెట్లతో చక్కటి ప్రదర్శన చేశాడు.