చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్నాడు టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ. ప్రపంచకప్ సెమీస్ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేదు. వచ్చే ఐపీఎల్లో సత్తాచాటి తిరిగి టీమ్‌లోకి వద్దామని భావించాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ లీగ్ వాయిదా పడింది. అసలు జరుగుతుందో లేదో అన్న అనుమానమూ లేకపోలేదు. అయితే ఐపీఎల్ జరిగినా జరగకపోయినా.. మహీ వచ్చే టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు అతడి చిన్ననాటి కోచ్ కేశవ్ రాంజన్ బెనర్జీ.
"ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఐపీఎల్ జరుగుతుందో లేదో చెప్పలేం. అందుకోసం బీసీసీఐ ఏం చెబుతుందో చూడాలి. ఇప్పుడు ధోనీ పరిస్థితి కూడా కఠినంగా ఉంది. కానీ నా దివ్యదృష్టి ప్రకారం ధోనీ టీ20 ప్రపంచకప్ ఆడతాడు. అదే మహీకి ఆఖరుది."