సచిన్ తెందూల్కర్.. అతడి బ్యాటింగ్‌కు ఫిదా అవ్వని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. ప్యాడ్స్ కట్టుకొని మైదానంలోకి వస్తున్నాడంటే 'సచిన్.. సచిన్' అంటూ అభిమానుల గోలతో స్టేడియం హోరెత్తుతుంది. అయితే ఇలా అరవడం మొదట ఎవరు ప్రారంభించారో తెలుసా? అతడి తల్లేనట. 'సచిన్.. సచిన్' అని తననుతొలిసారి పిలిచిందని మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
"సచిన్.. సచిన్ అని మొదట పిలిచింది ఎవరో తెలుసా? మా అమ్మ. నాకు ఐదేళ్లున్నప్పుడు స్నేహితులతో కలిసి మా బిల్డింగ్ కింద ఆడుకుంటున్నా. కాసేపటి తర్వాత ఇంటికి రమ్మని మా అమ్మ కోరింది. నేను ఆడుకోవాలని తిరస్కరించా. అప్పడు ఆమె బాల్కనీలో నిల్చొని సచిన్.. సచిన్ అని అరవడం ప్రారంభించింది" -సచిన్ తెందూల్కర్
తానాడిన చివరి మ్యాచ్‌ను అమ్మ.. ప్రత్యక్షంగా తొలిసారి చూసిందని, అప్పుడు భావోద్వేగానికి గురయ్యానని మాస్టర్ అన్నాడు.
"ఈ విషయం గురించి చెప్పాలంటే మాటలు రావడం లేదు. నేను ఆడిన ఇన్నేళ్లలో మా అమ్మ ఒక్కసారైనా మ్యాచ్ ప్రత్యక్షంగా చూడలేదు. ఈసారి అయినా స్టేడియానికి వచ్చి చూడమని కోరా. నేను ఎన్ని పరుగులు చేస్తానో గ్యారెంటీ లేదు.. కానీ నా ఆట చూడాలని అన్నా. ఆమె ఒప్పుకుంది. వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. ఆమె తిరిగి వెళ్లిపోవాలనుకుంది. అయితే ఈ రోజు సచిన్ బ్యాటింగ్ చేస్తాడని నా స్నేహితుడొకరు ఆమెకు నచ్చజెప్పి ఉండేలా ఒప్పించాడు" - సచిన్ తెందూల్కర్
"అదృష్టవశాత్తు ఆ రోజే మేం బ్యాటింగ్ చేసే అవకాశమొచ్చింది. రోజు ముగియడానికి ఇంకో ఓవర్ ఉందనగా.. చాలా కంగారుపడ్డా. స్క్రీన్‌పై అమ్మను చూసేసరికి భావోద్వేగానికి గురయ్యా. ఈ ఒక్క ఓవర్ ఎలాగోలా గట్టేక్కతే చాలు.. నన్ను ఔట్ చేయకండి అని మనసులో అనుకున్నా. నా సోదరుడు, అంజలి ఇతర కుటుంబ సభ్యులు అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ప్రతి బంతి కౌంట్ చేస్తున్నారు. ఎట్టకేలకు ఆ రోజు సాయంత్రం నేను ఔటవ్వలేదు. ఆ క్షణాలను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను" - సచిన్ తెందూల్కర్
2013 నవంబరులో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు... సచిన్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్. అందులో 74 పరుగులు చేశాడు. ఇది మాస్టర్‌కు 200వ టెస్టు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్.. ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇదీ చదవండి: కోహ్లీపై పిచ్చి అభిమానం.. ఒళ్లంతా పచ్చబొట్ల మయం