తెలంగాణ

telangana

ETV Bharat / sports

చెన్నైపై ముంబయిదే ఆధిపత్యం: గంభీర్

మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్​లో ముంబయి పూర్తిగా ఆధిపత్యం వహిస్తుందని తెలిపాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ గంభీర్.

Mumbai Indians will get edge over Chennai Super kings in the first match says Gautam Gambhir
చెన్నైపై ముంబయిదే ఆధిపత్యం: గంభీర్

By

Published : Sep 15, 2020, 8:16 PM IST

మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఆధిపత్యం చెలాయిస్తుందని కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మాజీ సారథి గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయమే ఉండగా, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌పై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ముంబయి జట్టు మాత్రం అన్ని విభాగాల్లో పటిష్ఠంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ లాంటి పదునైన పేసర్లున్నారు. దీంతో ఈ జట్టును ఎదుర్కోవడం ధోనీసేనకు కష్టతరమేనని గౌతీ అన్నాడు. ఇటీవల సీఎస్కే జట్టులోని ప్రధాన బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా వ్యక్తిగత కారణాలతో తప్పుకోగా, మరో బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కరోనా వైరస్‌ బారిన పడ్డాడు. అతడింకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో టాపార్డర్​లో ఎవరిని ఆడించాలనే విషయంపై ఆ జట్టు సందిగ్ధంలో పడింది.

ముంబయిలో ప్రధాన పేసర్‌ లసిత్‌ మలింగ వ్యక్తిగత కారణాల వల్ల లీగ్​ నుంచి తప్పుకున్నాడు. అలాగే ఈసారి కొత్తగా ట్రెంట్‌ బౌల్ట్‌ను తీసుకుంది. దీంతో ఆరంభ మ్యాచ్‌లో బుమ్రా, బౌల్ట్‌ బౌలింగ్‌ను చూడాలనుకుంటున్నట్లు గంభీర్‌ చెప్పాడు. వాళ్లిద్దరూ ప్రపంచశ్రేణి బౌలర్లని, టీ20ల్లో వికెట్లు తీయగల సమర్థులని ప్రశంసించాడు. ఈ క్రమంలోనే ఆ ఇద్దరు పేసర్లూ చెలరేగితే చెన్నైకి కష్టాలు తప్పవన్నాడు.

సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా ఆడకపోవడం, షేన్‌ వాట్సన్‌ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండడం, ఇవన్నీ చూస్తుంటే సీఎస్కేకు ప్రతికూలంగా ఉన్నాయని తెలిపాడు గంభీర్. వాట్సన్‌ ఎలా ఆడతాడో, ఎవరితో కలిసి బరిలోకి దిగుతాడోనని మాజీ క్రికెటర్‌ సందేహం వెలిబుచ్చాడు.

గతేడాది జరిగిన ఫైనల్లో ఈ రెండు జట్లూ హోరాహోరీగా తలపడ్డాయి. ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్‌ చివరి బంతివరకూ పోరాడి 1 పరుగుతో విజయం సాధించింది. దీంతో రికార్డు స్థాయిలో రోహిత్‌ జట్టు నాలుగోసారి ఐపీఎల్‌ ట్రోఫీని ముద్దాడింది.

ABOUT THE AUTHOR

...view details