2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్ క్రికెట్ ప్రేమికుల మదిలో చిరకాలం నిలిచి ఉంటుంది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం దేశానికి ప్రపంచకప్ అందించిన షాట్ అది. అందుకే ఆ గెలుపు జ్ఞాపకాలను మరింత పదిలం చేసేందుకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. భారత క్రికెట్‌కు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా మహీ పేరిట సీటు ఏర్పాటు చేయనుంది.
వాంఖడే స్టేడియంలో ఆ బాల్ పడిన సీట్‌తో పాటు ప్రాంతాన్ని అందంగా అంకరించాలనుకుంటోంది. ఎంసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ఆజింక్య నాయక్ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎంసీఏకు ఓ లేఖ రాశారు. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన అపారమైన సేవలకు కృతజ్ఞతగా బాల్ పడిన సీట్‌ను ధోనీకి అంకితమివ్వాల్సిందిగా కోరారు.
"వాంఖడే స్టేడియంతో ధోనీకి ఉన్న బంధాన్ని తెలియజేస్తూ అతడు కొట్టిన ప్రపంచకప్ విన్నింగ్ సిక్స్ జ్ఞాపకాలను పదిలం చేయాలనుకుంటున్నాం. ఆ బాల్ పడిన ప్రాంతాన్ని గుర్తించి ఆ సీట్‌ను పెయింట్ వేసి అందంగా అలంకరిస్తాం. ఆ ప్రాంతాన్ని పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం"