తెలంగాణ

telangana

ETV Bharat / sports

భవిష్యత్తులో పంత్ మరింత పుంజుకుంటాడు: ఎమ్మెస్కే - Rishabh Pant

భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, భవిష్యత్తులో మెరుగవుతాడని సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. అతడికి అండగా నిలవాలని చెప్పాడు.

Msk Prasad told About Rishabh pant
ఎమ్మెస్కే ప్రసాద్

By

Published : Dec 27, 2019, 7:03 PM IST

టీమిండియా యువ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ భవిష్యత్తులో మరింత మెరుగవుతాడని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అభిప్రాయపడ్డాడు. అతడు ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడని, ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాడని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

"పంత్‌ యువ ఆటగాడు. చిన్నతనంలోనే టీమిండియాలోకి వచ్చాడు. క్రికెట్‌ను నేర్చుకుంటున్నాడు. అతడికి ఎంతో సమయం ఉంది. రిషభ్ దేశవాళీ క్రికెట్‌ ఎక్కువగా ఆడలేదు. మైదానంలో తడబాటుకు అదీ ఓ కారణమే. కచ్చితంగా పుంజుకుంటాడు. కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి పరీక్షలను ఎదుర్కోవడం పంత్​కు ఎంతో మంచిది. మీరు కీపింగ్‌ సరిగా చేయకపోతే బ్యాటింగ్‌ అంతగా చేయలేరు. అలాగే మీరు పరుగులు సాధించకపోయినా కీపింగ్‌లో రాణించలేరు" -ఎమ్మెస్కే ప్రసాద్,టీమిండియా సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌

అనుభవంతో అతడు నేర్చుకుంటాడని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు.

"ఒత్తిడిలో ఉన్నప్పుడు చేతులు, కాళ్లు, కండరాలు గట్టిపడతాయి. అప్పుడు బంతిని అందుకోవడంలో విఫలమవుతుంటాం. అదే ఒత్తిడి లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉంటే బంతిని అద్భుతంగా అందుకోగలరు. ప్రతి బంతిని షాట్‌ ఆడాలని ప్రయత్నించకుండా మంచి ఇన్నింగ్స్‌ ఆడటంపై అతడు దృష్టి సారిస్తున్నాడు. అనుభవంతో నేర్చుకుంటున్నాడు. బ్యాటింగ్‌ చేసేటప్పుడు బంతి బ్యాట్‌కు మధ్యలో తగిలేలా, కీపింగ్‌ చేసేటప్పుడు గ్లోవ్స్‌ మధ్యలో ఉండేలా చూసుకోవాలి. అతడికి ఎంతో ప్రతిభ ఉంది. ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పిచ్‌లపై శతకాలు బాదాడు. అతడికి అండగా నిలవాలి"
-ఎమ్మెస్కే ప్రసాద్, సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో పంత్‌ రాణించాడు. తొలి మ్యాచ్‌లో కష్టాల్లో ఉన్న జట్టును శ్రేయస్‌తో కలిసి ఆదుకున్నాడు. రెండో మ్యాచ్‌లో దూకుడుగా ఆడి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. కానీ, కీపింగ్‌లో ఆకట్టుకోలేకపోయాడు.

ఇదీ చదవండి: 'కనేరియాపై వివక్షే.. పాక్ నిజస్వరూపానికి సాక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details