తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నేనూ ధోనీ అభిమానినే.. రిటైర్మెంట్​పై మహీనే మాట్లాడాలి' - ఎమ్మెస్కే ప్రసాద్

నాలుగేళ్లుగా టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్​గా బాధ్యతలు నిర్వర్తించి.. తనదైన ముద్రవేశాడు ఎమ్మెస్కే ప్రసాద్​. అనేక మంది యువ క్రికెటర్లను భారత జట్టుకు ఎంపిక చేసిన అతడితో ప్రత్యేక ముఖాముఖి మీకోసం.

msk prasad special interview with eenadu
నేనూ ధోనీ అభిమానినే.. రిటైర్మెంట్​పై మహీనే చెప్పాలి: ఎమ్మెస్కే

By

Published : Dec 15, 2019, 7:56 AM IST

ఎమ్మెస్కే ప్రసాద్‌.. భారత క్రికెట్‌ సెలక్షన్‌ ఛైర్మన్‌గా తనదైన ముద్ర వేసిన తెలుగు తేజం. 2015లో సెలెక్టర్‌గా.. 2016 నుంచి చీఫ్‌ సెలెక్టర్‌గా సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించాడు. నాలుగేళ్లలో ఎంతోమంది యువ క్రికెటర్లను టీమిండియా క్రికెటర్లుగా తీర్చిదిద్దడంలో ఎమ్మెస్కే బృందం పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా తన విజయాలు, నిరాశ కలిగించిన సందర్భాలు, తన బృందంపై వచ్చిన విమర్శలు తదితర అంశాలపై ఎమ్మెస్కే 'ఈనాడు' ప్రత్యేక ముఖాముఖిలో మాట్లాడాడు. ఆ విశేషాలు..

నాలుగేళ్ల పదవీకాలాన్ని ఎలా విశ్లేషిస్తారు?

అద్భుతంగా సాగింది. పటిష్టమైన బెంచ్‌ బలగాన్ని సిద్ధం చేశాం. మూడు ఫార్మాట్లలో ప్రతి విభాగంలోనూ ఒక్కొక్కరికి ఇద్దరిని ప్రత్యామ్నాయంగా సిద్ధం చేసి ఉంచాం. ఒక ఆటగాడు గాయపడితే ప్రత్యామ్నాయం గురించి వెతుక్కునే పరిస్థితి లేదిప్పుడు. స్టాండ్‌బైలు సిద్ధంగా ఉన్నారు. వాళ్లంతా అగ్రశ్రేణి ఆటగాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఆడుతున్నారు. మయాంక్‌ అగర్వాల్‌ ఇందుకు నిదర్శనం. ఒక్క అవకాశం ఇచ్చాం. అయిదారు నెలలకే తిరుగులేని స్థాయికి చేరుకున్నాడు. పృథ్వీ షా అంతే. అరంగేట్ర మ్యాచ్‌లోనే శతకం సాధించాడు. కుర్రాళ్లను సానబెట్టే ప్రక్రియ చక్కగా సాగుతోంది.

సెలెక్షన్‌ ప్రక్రియలో మీరు అవలంబిస్తున్న కొత్త పద్ధతులేంటి?

సీనియర్‌ జట్టు పర్యటనకు ముందు షాడో టూర్లు పెడుతున్నాం. భారత జట్టుకు పర్యటనకు ముందు అదే దేశంలో నెల రోజుల ముందు ఇండియా-ఎ పర్యటిస్తుంది. ఆ జట్టులోని ఆటగాళ్లకు అక్కడి పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. సీనియర్‌ జట్టులో ఎవరైనా గాయపడినా.. ఫామ్‌లో లేకపోయినా ఇండియా-ఎ నుంచి ఆటగాళ్లను ఎంచుకుంటాం. మయాంక్‌, శుభ్‌మన్‌, సైనీ, విహారి, పృథ్వీ అలా వచ్చినవాళ్లే. సెలక్టర్లు, టీమ్‌ఇండియా కెప్టెన్‌, కోచ్‌, రాహుల్‌ ద్రవిడ్‌.. అందరం కలిసి ఈ ప్రణాళికను ఆచరణలో పెట్టాం. మంచి ఫలితాలు వస్తున్నాయి.

ప్రతిభావంతులను ఎలా పర్యవేక్షిస్తున్నారు?

సెంట్రల్‌ కాంట్రాక్టులో ఉన్న 25 మంది క్రికెటర్లతో పాటు 25 మందితో బృందాన్ని సిద్ధం చేశాం. వీళ్లు కాకుండా దేశవాళీ క్రికెట్లో మరో 60 నుంచి 80 మంది ఆటగాళ్లను గుర్తించాం. వీళ్లంతా ఎక్కడ ఆడుతున్నా సెలెక్టర్లం వెళ్లి వారి ఆటను నిశితంగా గమనిస్తాం. ఒక సెలెక్టర్‌ టీమిండియాతో ఉంటాడు. మిగతా నలుగురు దేశవాళీ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లను పరిశీలిస్తారు. మేం వెళ్లని చోట్ల మ్యాచ్‌ రిఫరీలకు ఈ బాధ్యత అప్పగిస్తాం. ఆ ఆటగాడి ప్రదర్శన మీద రిఫరీ నివేదిక ఆధారంగా వివరాలన్నీ పొందుపరుస్తాం. ప్రతి సెలక్టర్‌ ఏడాదిలో 240 నుంచి 260 రోజులు పర్యటనల్లో గడిపాం. దాదాపు 1000 రోజులు ఇంటికి దూరంగా ఉంటూ బాధ్యతలు నిర్వర్తించాం.

ఎమ్మెస్కే ప్రసాద్

రిజర్వ్‌ బెంచ్‌ను ఏ విధంగా పటిష్టం చేశారు?

ఇంకో అయిదారేళ్లు ఆటగాళ్ల గురించి ఆలోచించాల్సిన అవసరమే లేనంతగా రిజర్వ్‌ బెంచ్‌ను పటిష్టం చేశాం. అశ్విన్‌, జడేజా ఫామ్‌లో ఉండగానే కుల్దీప్‌, చాహల్‌లను తీసుకొచ్చాం. ఇంకా గౌతమ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, మయాంక్‌ మార్కండే, షాబాజ్‌ నదీమ్‌ లాంటి స్పిన్నర్లను సిద్ధం చేశాం. అశ్విన్‌, జడేజా తర్వాత ఎవరన్న ప్రశ్న రాకముందే పది మందికి పైగా స్పిన్నర్లు తయారయ్యారు. వీళ్లందరూ మూడు ఫార్మాట్లలో ఆడగలిగినవాళ్లు. టెస్టుల్లో విజయ్‌ విఫలమవుతున్నపుడే రోహిత్‌ను ఓపెనర్‌ స్థానానికి పంపాం. కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, ప్రియాంక్‌ పాంచల్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌ సహా ఆరుగురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. వన్డేలు, టీ20ల్లోనూ ఇదే ప్రక్రియ కొనసాగుతోంది.

కుర్రాళ్లపై ఎక్కువ దృష్టిపెట్టడం వల్ల సీనియర్లలో అభద్రతా భావం పెరగదా?

అశ్విన్‌, జడేజా మంచి ఫామ్‌లో ఉండగానే కుల్‌దీప్‌, చాహల్‌లను తీసుకొచ్చాం. పోటీ ఉన్నపుడే ఆటగాళ్లలో తపన పెరుగుతుంది. టీమిండియాలో కొనసాగాలంటే అత్యుత్తమంగా ఉండాల్సిందే. ఇంత పెద్ద దేశం నుంచి ప్రతిభావంతులు పోటీగా వస్తూనే ఉంటారు. దాన్ని ఒత్తిడిగా భావించాల్సిన పని లేదు.

చీఫ్‌ సెలెక్టర్‌గా మీకు సంతృప్తినిచ్చిన సందర్భాలు?

మా హయాంలో భారత జట్టు ఎన్నో గొప్ప విజయాలు సాధించడం సంతోషం. వ్యక్తిగతంగా షాడో టూర్ల ఆలోచన సంతృప్తినిచ్చింది. దీని వల్ల మయాంక్‌ లాంటి ఆటగాళ్లు నిలదొక్కుకున్నారు. జట్టుకూ ఉపయోగపడ్డారు. మెల్‌బోర్న్‌ టెస్టుకు ముందు అతను న్యూజిలాండ్‌లో ఆడుతున్నాడు. ఈ రెండు చోట్లా వాతావరణం ఒకేలా ఉంటుంది. ధావన్‌కు గాయమని తెలియగానే మయాంక్‌ను రప్పించాం. తొలి మ్యాచ్‌లోనే అనుభవజ్ఞుడిలా ఆడాడంటే ప్రణాళిక వల్లే సాధ్యమైంది. బుమ్రా విశ్రాంతిలో ఉన్నా ఎన్‌సీఏలో అతడి సాధన సాగుతోంది. అతను ఏ సిరీస్‌కు తిరిగొచ్చినా విరామం తీసుకున్నట్లు కనిపించడు. గతంలో విశ్రాంతి తర్వాత బుమ్రా ఆటను చూస్తే ఆ సంగతి అర్థమవుతుంది.

ఆటగాడిగా అనుభవం తక్కువుండటాన్ని గుర్తు చేస్తూ సెలక్టర్‌గా మీ పనితనాన్ని విమర్శిస్తుంటారు. దానికి మీ సమాధానం?

ఎన్ని మ్యాచ్‌లు ఆడానన్నది ముఖ్యం కాదు. ఎంత బాగా బాధ్యతల్ని నిర్వహిస్తున్నామన్నది కీలకం. నేను భారత జట్టు యాజమాన్యం నమ్మకం గెలవగలిగా. గతంలో మాదిరి జట్టు యాజమాన్యంతో సెలక్షన్‌ కమిటీకి విభేదాల్లేవు. మాటల యుద్ధాల్లేవు. నాలుగేళ్లలో ఇలాంటి ఉదంతం ఒక్కటీ లేదు. ఏ కొత్త ఆటగాడినా ఎంపిక చేసినా మాపై వ్యతిరేకత రాలేదు. గతంలో ఎవరికీ తెలియని పేరు అకస్మాత్తుగా టీమిండియాలో కనిపించేది. ఇప్పుడు ఎంతో కసరత్తు చేసి ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నాం. శ్రేయస్‌ను రెండేళ్లు సానబెట్టాం. సైనీ కూడా అంతే. వీళ్లను పర్యవేక్షిస్తూ వివిధ జట్లలో ఆడిస్తేనే టీమిండియాలోకి వచ్చారు.

అంబటి రాయుడిని ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంపై తలెత్తిన వివాదంపై ఏం చెబుతారు?

ఐపీఎల్‌లో బాగా ఆడినందుకు వన్డే జట్టులోకి తీసుకున్నాం. ఫిట్‌నెస్‌ పరీక్షలో విఫలమైతే ఎన్‌సీఏలో నెల రోజులు ఉంచి ఫిజియోతో ప్రత్యేకంగా పర్యవేక్షించా. అందుకు తగ్గట్లే అతను మంచి ప్రదర్శన ఇచ్చాడు. నిజానికి రాయుడిని టెస్టుల్లోనూ ఆడించాలని అనుకున్నాం. 2016లో జింబాబ్వే పర్యటనలో ఈ విషయమై అతడితో మాట్లాడా. రాయుడితో నేను కలిసి ఆడాను కూడా. ప్రపంచకప్‌కు రాయుడు ఎంపికవకపోవడంపై అందరిలా నేనూ బాధపడ్డా.

ఎమ్మెస్కే ప్రసాద్​

ఈ పదవీ కాలంలో బాధాకరమైన సందర్భాలు?

దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌ల్లో టెస్టు సిరీస్‌లు ఓడిపోవడం బాధ కలిపించింది. బాగా ఆడినా ఆశించిన ఫలితాలు రాలేదు. గెలవాల్సిన సిరీస్‌లవి. ప్రపంచకప్‌లోనూ టీమిండియా ఛాంపియన్‌లా ఆడింది. ఒక్క ప్రతికూలమైన రోజు ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించింది. అయితే న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో వన్డే సిరీస్‌లు గెలిచాం.

జెర్సీ లోపల జీపీఎస్‌

సీనియర్లకు విశ్రాంతినివ్వడానికి ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తున్నారని, పనిభారాన్ని ఎలా అంచనా వేస్తున్నారని అడిగితే ప్రసాద్‌ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆటగాళ్లు ధరించే జీపీఎస్‌ స్టిమ్‌ ఆధారంగా వారిపై పనిభారాన్ని లెక్కగడుతున్నటు తెలిపాడు. ‘‘కొందరు ఆటగాళ్లు మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్నారు. వారిపై అదనపు భారం పడుతుందేమో చూస్తాం. ఒక ఆటగాడు ఏడాదిలో ఇన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలన్న నిబంధనేమీ లేదు. సిరీస్‌ ఎంత కీలకమైంది, జట్టు అవసరాలు, పనిభారాన్ని బట్టే విశ్రాంతి ఇస్తున్నాం. ప్రస్తుతం జట్టులోని ప్రతి ఆటగాడూ జెర్సీ లోపల బెల్ట్‌ తరహాలో జీపీఎస్‌ను ధరిస్తున్నాడు. దీని వల్ల మ్యాచ్‌లో అతను ఎంత శ్రమిస్తున్నాడో ఎప్పటికప్పుడు తెలిసిపోతుంది. ఈ వివరాల ప్రకారం ఫిజియో, ట్రైనర్‌ ఆటగాడి చార్ట్‌ సిద్ధం చేస్తారు. మ్యాచ్‌లో ఒక ఆటగాడు సగటున 12-13 కిలోమీటర్లు పరుగెత్తుతాడు. కోహ్లి పెద్ద ఇన్నింగ్స్‌ ఆడితే 17-18 కి.మీ. పరుగెత్తుతాడు. కొన్ని నెలల పాటు పనిభారానికి సంబంధించిన వివరాల్ని సమీక్షించి ఆటగాడికి తగిన సమయంలో విశ్రాంతినిస్తాం. ఇటీవల ఉమేశ్‌పై భారం పెరిగిందనిపించింది. రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్‌ ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించాం’’ అని ప్రసాద్‌ తెలిపాడు.

ధోని భవితవ్యంపై ఏమంటారు?

రిటైర్మెంట్‌ నిర్ణయం ధోని తీసుకోవాల్సింది. మేం యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలిచ్చి జట్టులో స్థిరపడేలా చూస్తున్నాం. సెలెక్టర్లుగా మా కర్తవ్యాన్ని పక్కన పెడితే.. అందరిలాగే మేమూ ధోనీకి వీరాభిమానులం. అతడి ఘనతలు, అంకితభావాన్ని ఎవ్వరూ తక్కువ చేయలేరు. అయితే ఎప్పుడు రిటైరవ్వాలన్నది పూర్తిగా ధోని ఇష్టం. సెలెక్టర్లుగా కొత్తవాళ్లకు అవకాశాలివ్వడం మా పని. వాళ్ల ఆటతీరును ధోని కూడా గమనిస్తుండొచ్చు. తన మనసులో ఏముందన్నది అతను చెప్తేనే తెలుస్తుంది.

ఇదీ చదవండి: ఈ దశాబ్దపు ప్రపంచ మేటి వన్డే బౌలర్లు వీరే..!

ABOUT THE AUTHOR

...view details