టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. 9 నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. గతేడాది ప్రపంచకప్‌లోని సెమీస్ తర్వాత మళ్లీ మైదానంలో కనిపించలేదు. ఫలితంగా అతడి రిటైర్మెంట్పై చాలా ఊహాగానాలు వచ్చాయి. అయినా పెదవి విప్పలేదు మహీ. తాజాగా ఇదే విషయమై మాట్లాడాడు తెలుగు క్రికెటర్ వేణుగోపాల్ రావు. 2023 వన్డే ప్రపంచకప్ వరకు ధోనీ జట్టులో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.
'2023 ప్రపంచకప్ వరకు ధోనీ జట్టులో ఉండాలి' - DHONI RETAIRMENT
2023లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు ధోనీ ఆడాలని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు మాజీ క్రికెటర్ వేణుగోపాల్ రావు. మహీ అనుభవం జట్టుకు చాలా పనికొస్తుందని చెప్పాడు.
"ధోనీ.. గత తొమ్మిది నెలల నుంచి క్రికెట్ ఆడటం లేదని తెలుసు. పునరాగమనంలో సత్తా చాటడం అతడికి ఏమాత్రం కష్టం కాదు. ఐసీసీ లాంటి టోర్నీల్లో ధోనీ అనుభవం ఎంతో పనికొస్తుంది. మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ అతడే అనే విషయం మర్చిపోవద్దు. వికెట్‌కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా మహీకి సాటిరాగల మరో ప్లేయర్ లేరు" -వేణుగోపాల్ రావు, భారత మాజీ క్రికెటర్
ప్రపంచకప్ అనంతరం సైన్యంలో పనిచేసిన ధోనీ.. ఆ తర్వాత వివిధ ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. వచ్చే నెలలో జరిగే ఐపీఎల్ కొత్త సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో సత్తా చాటితే టీ20 ప్రపంచకప్ కోసం అతడి పేరును పరిగణలోకి తీసుకుంటామని టీమిండియా కోచ్ రవిశాస్త్రి గతంలోనే చెప్పాడు. ఈ విషయంపైనా స్పందించిన వేణుగోపాల్.. మహీకి కచ్చితంగా జట్టులో అవకాశం వస్తుందని అభిప్రాయపడ్డాడు.