తెలంగాణ

telangana

ETV Bharat / sports

హెలికాప్టర్‌ గమనం.. భారత క్రికెట్‌లో సంచలనం - క్రికెట్​ న్యూస్​

మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు. 16 ఏళ్ల ప్రస్థానానికి శనివారం ముగింపు పలికాడు. సొంతగడ్డ మీద శ్రీలంకపై ఫైనల్లో 91 నాటౌట్‌తో చెలరేగి 28 ఏళ్ల వన్డే ప్రపంచకప్‌ కల నిజంచేసి మరీ ఎక్కువ రోజులేం కాలేదు.. అప్పుడే ఆట నుంచి వైదొలిగాడా? అని అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. ఆటగాడిగా, సారథిగా మిస్టర్‌ కూల్‌ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఒక్కసారి ఆ కాల గమనంలోకి పరుగులు తీద్దాం! అతడి ఉనికిని కళ్లల్లో నింపుకొందాం.

ms dhoni retired from international cricket on 15th august
హెలికాప్టర్‌ గమనం.. భారత క్రికెట్‌లో సంచలనం

By

Published : Aug 16, 2020, 5:09 AM IST

ఆ బక్కపల్చని జులపాల జుట్టు కుర్రాడు పాక్‌ బౌలర్లను చీల్చి చెండాడిన విధానం ఇంకా కళ్ల ముందే కదలాడుతోంది. యువకులతో దక్షిణాఫ్రికాకు వెళ్లి తొలి టీ20 ప్రపంచకప్‌ ముద్దాడింది ఈ మధ్యే కదా! సొంతగడ్డ మీద శ్రీలంకపై ఫైనల్లో 91 నాటౌట్‌తో చెలరేగి 28 ఏళ్ల వన్డే ప్రపంచకప్‌ కల నిజంచేసి మరీ ఎక్కువ రోజులేం కాలేదు. టెస్టుల్లో టీమిండియాను అగ్రస్థానానికి చేర్చింది మొన్ననే కదా! రెండు ఆసియా కప్‌లు, ఓ ఛాంపియన్స్‌ ట్రోఫీ అందుకొని అభిమానులను మురిపించి ఎక్కువ కాలం ఏం కాలేదు!

కానీ.. ఏంటో అప్పుడే ఎంఎస్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు! తరచి చూస్తే అతడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి రంగప్రవేశం చేసి అప్పుడే 16 ఏళ్లు దాటింది. ఎన్ని ఘనతలు పొందినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఏదో ఓ రోజు చేస్తున్న పనికి శాశ్వత విరామం ప్రకటించాల్సిందే కదా. అభిమానులకు కొంత నిరాశ తప్పదు. ఇదే దశను సచిన్‌, క్లైవ్‌లాయిడ్‌, మారడోనా, పీలే, మార్టినా నవత్రిలోవా తదితర క్రీడాకారులకూ తప్పలేదు. ఇప్పుడు ధోనీకీ తప్పలేదు. ఆటగాడిగా, సారథిగా మిస్టర్‌ కూల్‌ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాడు. ఒక్కసారి ఆ కాల గమనంలోకి పరుగులు తీద్దాం! అతడి ఉనికిని కళ్లల్లో నింపుకొందాం.

వరుస శతకాలు (2004, ఆగస్టు 16, 19)

భారత్‌-ఏ తరఫున పాక్‌-ఏపై వరుస శతకాలతో ధోనీ చెలరేగాడు. ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌కు చేర్చి మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

అరంగేట్రంలో డకౌట్‌ (2004, డిసెంబర్‌ 23)

అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌పై తొలి వన్డేలోనే డకౌట్‌ అయ్యాడు. రనౌట్‌గా వెనుదిరిగాడు. మూడు మ్యాచ్‌లో సిరీస్‌లో మొత్తం 19 పరుగులే చేశాడు.

దక్కని చోటు (2005, ఫిబ్రవరి 8)

ఛాలెంజర్స్‌ సిరీస్‌లో భారత్‌-బీ సీనియర్స్‌ తరఫున 96 బంతుల్లోనే 102* పరుగులు చేశాడు. అయినప్పటికీ పాక్‌పై ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌కు మహీ ఎంపిక కాలేదు. దినేశ్‌ కార్తీక్‌ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.

మార్మోగిన పేరు (2005, ఏప్రిల్‌ 5)

సొంత దేశంలో పాక్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. గంగూలీ ఆదేశాల మేరకు మూడో స్థానంలో క్రీజులోకి వచ్చాడు. 123 బంతుల్లోనే 148 పరుగులు చేసి అభిమానులను ఉర్రూతలూగించాడు. ద్రవిడ్‌ తర్వాత శతకం బాదిన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. అతడి స్కోరుతో భారత్‌ 356 పరుగులు చేసింది. మ్యాచ్‌ గెలిచి సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది.

ఆనందం రెట్టింపు (2005, అక్టోబర్‌ 31)

వన్డే జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. జైపుర్‌లో శ్రీలంకపై ఛేదనలో 10 సిక్సర్లు, 16 ఫోర్లతో 145 బంతుల్లోనే 183 పరుగులతో అజేయంగా నిలిచాడు. వికెట్‌ కీపర్‌గా అత్యధిక స్కోరు సాధించాడు. సిరీస్‌లో జట్టుకు 3-0తో ఆధిక్యం అందించాడు. చివరి ఈ సిరీస్‌ను టీమిండియా 6-1తో కైవసం చేసుకుంది. ధోనీ మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

టెస్టుల్లో అరంగేట్రం (2005, డిసెంబర్‌ 2)

చెన్నైలో శ్రీలంకపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. వర్షంతో ఆగిపోయిన మ్యాచ్‌లో 31 పరుగులు చేశాడు.

ఆదిలోనే ఎదుగుదల (2005, డిసెంబర్‌ 12)

శ్రీలంకపై 51 బంతుల్లో 51 చేసి టెస్టుల్లో తొలి అర్ధశతకం అందుకున్నాడు. యువీతో కలిసి ఏడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం అందించాడు.

షాట్లకు ఫిదా (2006, జనవరి 23-24)

టెస్టుల్లో తొలి శతకం సాధించాడు. ఫైసలాబాద్‌లో పాక్‌ తొలి ఇన్నింగ్స్‌లో 588 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 281/5తో ఉన్న వేళ ఈ శతకం అందుకోవడం గమనార్హం. షోయబ్‌ అక్తర్‌ బౌలింగ్‌ను అడ్డుకొని మరిచిపోలేని హుక్‌షాట్లతో 153 బంతుల్లో 148 చేశాడు. భారత్‌ 15 పరుగుల ఆధిక్యం అందించాడు.

షినిషర్‌ అవతారం (2006, ఫిబ్రవరి 6, 13, 19)

పాక్‌పై వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌ కొనసాగిస్తూ ఫినిషర్‌గా ముద్ర వేయడం మొదలుపెట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 53 బంతుల్లో 68, 46 బంతుల్లో 72, 56 బంతుల్లో 77తో ఆకట్టుకున్నాడు. ఈ సిరీస్‌ను టీమిండియా 4-1తో నెగ్గింది.

ప్రపంచ నంబర్‌-1 (2006, ఏప్రిల్‌ 20)

42 మ్యాచుల తర్వాత 52కు పైగా సగటు, 103 స్ట్రైక్‌రేట్‌తో వన్డేల్లో నంబర్‌-1 బ్యాట్స్‌మన్‌గా ఎదిగాడు. రికీ పాంటింగ్‌ను వెనక్కి నెట్టాడు.

ఒంటరి పోరాటం (2007, మే 10)

ప్రపంచకప్‌లో మరోసారి టీమిండియా పరువు పోకుండా అడ్డుకున్నాడు. బంగ్లాదేశ్‌పై 250 పరుగుల ఛేదనలో భారత్‌ 63కే 3 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 106 బంతుల్లో 91 పరుగులు చేసి ఆదుకున్నాడు. ఒంటరి పోరాటం చేశాడు.

కాపాడాడు (2007, జులై 23)

చక్కని ఇన్నింగ్స్‌తో లార్డ్స్‌ టెస్టులో పరువు నిలిపాడు. తొలి టెస్టులో 380 పరుగుల ఛేదనలో ఆఖరి రోజు భారత్‌ 145/5తో కష్టాల్లో పడింది. తనదైన రీతిలో ధోనీ నిలకడగా ఆడాడు. మూడు గంటలకు పైగా క్రీజులో నిలిచాడు. 159 బంతులాడి 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. వర్షం మ్యాచ్‌ ముందుగానే ముగిసే వరకు కుదురుగా బ్యాటింగ్‌ చేశాడు. భారత్‌ను 282/9తో కాపాడాడు. ఆ తర్వాత టీమిండియా 1-0తో సిరీస్‌ గెలిచింది.

పగ్గాలు (2007, ఆగస్టు 7)

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు జట్టు సారథిగా ఎంపికయ్యాడు. ఈ ట్రోఫీకి సచిన్‌, ద్రవిడ్‌, గంగూలీ దూరంగా ఉన్నారు!

ఎదుగుదల (2007, సెప్టెంబర్‌ 18)

సారథ్యానికి రాహుల్‌ ద్రవిడ్‌ గుడ్‌బై చెప్పడంతో ధోనీ వన్డే పగ్గాలు అందుకున్నాడు.

ఏడాదిలోపే విశ్వవిజేత (2007, సెప్టెంబర్‌ 24)

ఆశాల్లేకుండా, అంచనాలు లేకుండా దక్షిణాఫ్రికా వెళ్లాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను అందించి సారథిగా ప్రశంసలు పొందాడు. మళ్లీ భారత క్రికెట్‌కు ఊపిరి పోశాడు!

ఆధిపత్యం మొదలు (2008, ఫిబ్రవరి-మార్చి)

సీబీ సిరీస్‌కు గంగూలీ, ద్రవిడ్‌ను ఎంపిక చేయకపోవడంతో వచ్చిన తీవ్ర విమర్శల్ని ఎదుర్కోన్నాడు. తొలిసారి టీమిండియా ఆసీస్‌తో ముక్కోణపు సిరీస్‌ను 2-0తో గెలవడంతో విమర్శలకు విలువ లేకుండా పోయింది.

టెస్టు సారథ్యం (2008, ఏప్రిల్‌ 11-13)

అనిల్‌ కుంబ్లే లేకపోవడంతో టెస్టు పగ్గాలు తీసుకున్నాడు. కాన్పూర్‌లో మూడు రోజుల్లోనే దక్షిణాఫ్రికాను ఓడించాడు. సిరీస్‌ను 1-1తో సమం చేశాడు.

టెస్టుల్లో నంబర్‌ 1 (2009-డిసెంబర్‌ 6)

ముంబయిలో శ్రీలంకను భారత్‌ ఓడించింది. సిరీస్‌ను 2-0తో గెలిచి టెస్టుల్లో తొలిసారి అగ్రస్థానానికి చేరుకుంది. బ్యాట్స్‌మన్‌గా ధోనీ తన ఆటను ఆస్వాదించాడు. సిరీస్‌లో మూడు ఇన్నింగ్సుల్లో రెండు శతకాలు బాదాడు.

నిజమైన 28 ఏళ్ల కల (2011, ఏప్రిల్‌ 2)

శతకోటి భారతీయులు 28 ఏళ్లుగా కన్న రెండో ప్రపంచకప్‌ కల నిజమైంది. యువరాజ్‌ సింగ్‌ అద్వితీయ పోరాటాలకు తోడు ధోనీ సారథ్య ప్రతిభతో భారత్‌ వన్డే ప్రపంచకప్‌ గెలిచింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, శ్రీలంకను నాకౌట్‌ మ్యాచుల్లో ఓడించింది. ఫైనల్లో ఛేదనలో మహీ 91* ఓ అద్భుత ఇన్నింగ్స్‌గా మిగిలింది.

పాక్‌ చేతిలో ఓటమి (2012)

దాయది ఐదేళ్ల తర్వాత భారత్‌లో పర్యటించింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-2తో ఓటమి పాలైంది. మూడు మ్యాచుల్లోనూ ధోనీ చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో టీమిండియా 29/5తో ఉన్న వేళ 113 పరుగులతో అజేయంగా నిలిచి 227 స్కోరు అందించాడు.

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ (2013, జూన్‌ 23)

భారత్‌ ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలిసారి ఐసీసీ నిర్వహించే అన్ని ట్రోఫీలు గెలిచిన సారథిగా ధోనీ ఘనత సాధించాడు.

ఆసీస్‌పై (2013, నవంబర్‌)

ఆస్ట్రేలియాపై వన్డేల్లో 1000 పరుగులు చేశాడు. భారత్‌లో సచిన్‌ తర్వాత ఈ ఘనత అందుకుంది ధోనీయే.

వరుస ఓటములు (2013-14)

దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై భారత్‌ 1-0 తేడాతో టెస్టు సిరీస్‌లు ఓడింది. 2014లో ఇంగ్లాండ్‌లో లార్డ్స్‌లో ఒక మ్యాచ్‌ గెలిచినప్పటికీ ఆ సిరీస్‌ను భారత్‌ 1-3తో ఓడిపోయింది. ధోనీ సారథ్యంపై విమర్శలు చెలరేగాయి.

టెస్టులకు వీడ్కోలు (2014, డిసెంబర్‌)

ధోనీ సంచలనం సృష్టించాడు. టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్‌ ఆడాడు. ఈ సిరీస్‌లో అతడు గాయపడడంతో ఓ మ్యాచ్‌కు కోహ్లీ సారథ్యం వహించాడు.

ప్రపంచకప్‌ సెమీస్‌ (2015, మార్చి)

వరుస విజయాలతో భారత్‌ సెమీస్‌ చేరింది. లీగ్‌ దశలో అన్ని మ్యాచ్‌లు గెలిచిన భారత సారథిగా ధోనీ రికార్డు సృష్టించాడు. సెమీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో ధోనీసేన పరాజయం పాలైంది. మహీ కళ్లలో తడి కనిపించింది.

పరిమిత ఓవర్ల సారథ్యానికి గుడ్‌బై (2017, జనవరి)

ఎంఎస్‌ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇంగ్లాండ్‌తో హోం సిరీస్‌కు ముందు పరిమిత ఓవర్ల సారథ్యానికి వీడ్కోలు పలికాడు. విరాట్‌ కోహ్లీకి బాధ్యతలు అప్పగించాడు.

10,000 మైలురాయి (2018, సెప్టెంబర్‌)

ఎంఎస్ ధోనీ వన్డేల్లో 10,000 పరుగుల మైలురాయి అధిగమించాడు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో సాధించాడు. ఈ ఘనత సాధించిన భారత నాలుగో ఆటగాడు మహీ. మొత్తంగా 12వ క్రికెటర్‌.

ఫామ్‌ లేమి (2018, ఆసియా కప్‌)

ఇంగ్లాండ్‌ సిరీస్‌లో తక్కువ స్ట్రైక్‌రేట్‌ 63.20తో మొత్తం 79 పరుగులు చేసిన ధోనీ ఆసియాకప్‌లోనూ అదే ఫామ్‌ కొనసాగించాడు. నాలుగు ఇన్నింగ్సుల్లో 19.25 స్ట్రైక్‌రేట్‌తో 77 పరుగులు చేసి విమర్శల పాలయ్యాడు. విండీస్‌ సిరీస్‌లోనూ 3 ఇన్నింగ్సుల్లో 50 పరుగులే చేశాడు.

టీ20ల్లో విశ్రాంతి (2018, ఆసీస్‌పై)

ఎంఎస్‌ ధోనీకి ఆస్ట్రేలియాతో హోం సిరీస్‌లో సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. ఈ వ్యవహారంపై అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అతడికి విశ్రాంతి మాత్రమే ఇచ్చామని బీసీసీఐ స్పష్టం చేసింది.

ఆసీస్‌, కివీస్‌పై జోరు (2018-19)

ఆస్ట్రేలియాపై ధోనీ మునుపటి ఫామ్‌ అందుకున్నాడు. రెండు అర్ధశతకాలతో 193 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌ను భారత్‌ 2-1తో గెలిచింది. ధోనీకి ప్లేయర్‌ ఆఫ్ ది సిరీస్‌ దక్కింది. న్యూజిలాండ్‌ పైనా అలాగే చెలరేగాడు.

ప్రపంచకప్‌లో మోస్తారు ప్రదర్శన (2019; జులై)

ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో ధోనీ మరీ గొప్ప ప్రదర్శనేమీ చేయలేదు. 9 మ్యాచుల్లో 45.50 సగటుతో 273 పరుగులు చేశాడు. కీపర్‌గా 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ముగ్గుర్ని స్టంపౌట్‌ చేశాడు.

సైన్యంలో సేవ (2019, ఆగస్టు)

ధోనీ భవితవ్యంపై అందరికీ సందేహాలు నెలకొన్నాయి. విండీస్‌ పర్యటనకు ఎంపిక చేస్తారా లేదా అని ఆత్రుతగా ఎదురుచూశారు. చివరికి అతడే సైన్యంలో రెండు నెలలు సేవ చేస్తానని జట్టుకు దూరమయ్యాడు.

సఫారీ సిరీస్‌కు దూరం (2019, సెప్టెంబర్‌)

భారత్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా వచ్చింది. మూడు టీ20ల సిరీస్‌కు ధోనీని ఎంపిక చేయలేదు. నిజానికి అతడే అందుబాటులో లేడని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ స్పష్టం చేశారు.

బీసీసీఐ కాంట్రాక్టు నిరాకరణ (2019)

ప్రపంచకప్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ ఆడని మహీకి బీసీసీఐ కాంట్రాక్టు నిరాకరించింది. టెస్టుల్లో ఆడడం లేదు కాబట్టి ఇవ్వడం లేదని పేర్కొంది.

ఐపీఎల్‌ కోసం ఎదురుచూపులు (2020)

మైదానంలో మహీని చూసేందుకు అభిమానులు ఆత్రుగా ఉన్నారు. అయితే కరోనా వైరస్‌ కారణంగా మార్చిలో జరగాల్సిన టోర్నీ వాయిదా పడింది. అభిమానులు ఉసూరుమన్నారు. అయితే సెప్టెంబర్‌ 19 యూఏఈ వేదికగా టోర్నీ జరుగుతుదని తెలియడంతో మళ్లీ ధోనీని చూస్తామని సంతోషించారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు (2020, ఆగస్టు 15 )

భారత క్రికెట్‌కు చేసిన సేవలకు 2007-08కి గాను రాజీవ్‌ ఖేల్‌రత్న, 2009లో పద్మశ్రీ, 2018లో పద్మభూషణ్‌ అందుకున్న ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు 'కూల్‌'గా (నిజానికి అందరికీ షాకిస్తూ) వీడ్కోలు పలికాడు. 'కెరీర్‌ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియో పెట్టాడు.

ఇదీ చూడండి: ధోనీ ఆటతీరే కాదు.. మాటతీరు అద్భుతమే

ABOUT THE AUTHOR

...view details