ఎంఎస్ ధోనీ బ్యాటింగ్ తీరుపై టీమ్‌ఇండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ ప్రశంసలు కురిపించారు. ఫలితంతో సంబంధం లేనట్టుగా అతడు చివరి వరకు ఆడతాడని పేర్కొన్నారు. ఏ మాత్రం ఒత్తిడి చెందకుండా తనలోని అత్యుత్తమ బ్యాటింగ్‌ను బయటకు తీసేందుకు ఇది ఉపయోగపడుతుందని వెల్లడించారు. తాజాగా సంజయ్ మంజ్రేకర్ నిర్వహించిన ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో వీడియోకాస్ట్‌లో ద్రవిడ్ మాట్లాడారు.
"మహీ అత్యుత్తమంగా ఆడుతున్నప్పుడు మ్యాచ్ చివర్లో అతడి బ్యాటింగ్ తీరును పరిశీలించండి. అతడు తనకు ముఖ్యమైన పనేదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ అతడు ఫలితంతో సంబంధం లేనట్టుగా ఆడతాడు. నిజానికి అలాంటి నైపుణ్యం అందరికీ అవసరం. లేదా అందుకోసం సాధన చేయాలి. అలాంటి నైపుణ్యం నాకు లేదు. ఒక నిర్ణయానికి సంబంధించిన పరిణామాల గురించి నేను పట్టించుకుంటా. ఏమీ పట్టనట్టు ఆడే కళ సహజంగానే అలవాటైందా! లేదా సాధన చేశాడా అని ఎంఎస్ ధోనీని అడిగితే ఆసక్తికరంగా ఉంటుంది".
- రాహుల్ ద్రవిడ్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్
గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగుపెట్టలేదు. ఐపీఎల్‌కు సిద్ధమైనప్పటికీ కరోనా వైరస్ కారణంగా సీజన్ వాయిదా పడింది. వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్ తర్వాత మహీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారని వార్తలొచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి విషయం బయటపడలేదు. అయితే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ తీరు విస్మయ పరిచిందని బెన్‌స్టోక్స్ పేర్కొన్నాడు. అసలు గెలిపించే ఉద్దేశమే అతడిలో కనిపించదని తన పుస్తకం 'ఆన్‌ఫైర్'లో రాశాడు.
బంగ్లాదేశ్‌పై 2004లో వన్డేల్లో అరంగేట్రం చేసిన మహీ 2005లో పాక్‌పై 148 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర వహించాడు. ఆ తర్వాత సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచకప్‌లు సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడాడు. టెస్టు క్రికెట్లో టీమ్ఇండియాను నంబర్‌వన్‌గా నిలిపాడు. ఒకవేళ ఐపీఎల్ జరగకపోతే ధోనీ ఏం చేస్తాడన్నది ఆసక్తికరం.
ఇదీ చూడండి.. శ్రీలంకతో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌కు బీసీసీఐ ఓకే!